Share News

అక్రమ వలసదారుల తరలింపు కొత్తేమీ కాదు

ABN , Publish Date - Feb 07 , 2025 | 04:47 AM

అక్రమ వలసదారులను వెనక్కి పంపే ప్రక్రియ కొత్తదేమీ కాదని విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. అయితే అక్రమ వలసదారుల పట్ల అనుచితంగా వ్యవహరించకుండా చూసేందుకు అమెరికాతో భారత ప్ర భుత్వం సంప్రదింపులు జరుపుతోందని

అక్రమ వలసదారుల తరలింపు కొత్తేమీ కాదు

వలసదారుల పట్ల దురుసుగా ప్రవర్తించకుండా అమెరికాతో సంప్రదింపులు జరుపుతాం: జైశంకర్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: అక్రమ వలసదారులను వెనక్కి పంపే ప్రక్రియ కొత్తదేమీ కాదని విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. అయితే అక్రమ వలసదారుల పట్ల అనుచితంగా వ్యవహరించకుండా చూసేందుకు అమెరికాతో భారత ప్ర భుత్వం సంప్రదింపులు జరుపుతోందని గురువారం రాజ్యసభలో వెల్లడించారు. టెక్సాస్‌ నుంచి 104 మంది అక్రమ వలసదారులను పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు తరలించిన సంగతి తెలిసిందే. అక్ర మ వలసదారుల పట్ల అమెరికా దారుణంగా వ్యవహరించిందని, వారికి సంకెళ్లు వేసి అవమానించిందంటూ విపక్ష సభ్యులు నిరసనకు దిగారు. దీనిపై కేంద్రం ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర మంత్రి జైశంకర్‌ స్పందించారు. ఏ దేశమైనా అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడంపై దృష్టి పెట్టాలని, అలాగే చట్టబద్ధంగా వచ్చే వారికి వీసాలు సులభతరం చేయడానికి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇక అమెరికా నుంచి అక్రమ వలసదారులను తరలించే ప్రక్రియ 2009 నుంచి కొనసాగుతోందన్నారు. చాలామంది వలసదారులకు అమెరికాలో ఆస్తులు ఉన్నాయన్న అంశంపై స్పందిస్తూ.. ఈ సమస్యను పరిష్కరించేందుకు అమెరికా అధికారులతో సంప్రదింపులు జరుపుతామని జైశంకర్‌ చెప్పారు. కాగా, భారతీయుల పట్ల అమెరికా వ్యవహరించిన తీరును నిరసిస్తూ విపక్షాలు.. గురువారం లోక్‌సభ, రాజ్యసభల్లో ఆందోళనకు దిగాయి. విపక్ష సభ్యులు పదేపదే వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేయడంతో లోక్‌సభ నాలుగుసార్లు వాయిదా పడింది. కాగా ,మోదీ, ట్రంప్‌ మంచి మిత్రులు అయినప్పటికీ భారతీయులకు ఇలా జరగడమేంటని ఎంపీ ప్రియాంక ప్రశ్నించారు. వలసదారులను రప్పించడానికి మోదీ ఎందుకు విమానాన్ని పంపలేదని నిలదీశారు. జైశంకర్‌ ప్రకటన అనంతరం విపక్ష ఎంపీలు పార్లమెంటు ఆవరణలో నిరసన ప్రదర్శన చేపట్టారు.

Updated Date - Feb 07 , 2025 | 04:47 AM