వేతనాలు ఎంత పెరుగుతాయి?
ABN , Publish Date - Jan 18 , 2025 | 05:17 AM
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదార్ల కోసం 8వ వేతన కమిషన్‌ను నియమిస్తామని కేంద్రప్రభుత్వం ప్రకటించటంతో..

8వ వేతన కమిషన్‌పై పలు అంచనాలు
వేతన పెంపు రూ.45 వేల వరకూ!
న్యూఢిల్లీ, జనవరి 17: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదార్ల కోసం 8వ వేతన కమిషన్‌ను నియమిస్తామని కేంద్రప్రభుత్వం ప్రకటించటంతో.. వేతనాలు, పింఛన్లు ఏ మేరకు పెరుగుతాయన్న దానిపై రకరకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ మేరకు ప్రముఖ బిజినెస్ పత్రిక ‘ఎకనమిక్ టైమ్స్’ పలువురు నిపుణులను సంప్రదించి వారి అభిప్రాయాలను వెల్లడించింది. టీమ్ లీజ్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణేందు చటర్జీ స్పందిస్తూ.. ‘ప్రస్తుత ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే ఉద్యోగుల వేతనాలు సగటున రూ.40 వేల నుంచి రూ.45 వేల మధ్యన పెరగవచ్చు’ అని తెలిపారు. ఈసారి పనితీరు ఆధారిత వేతన పెంపు అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ‘కింగ్ స్టబ్ అండ్ కాసివా’ అనే సంస్థకు చెందిన రోహితాశ్వ్ సిన్హా మాట్లాడుతూ.. కొత్త వేతన కమిషన్ వల్ల మూల వేతనంలో 186ు పెంపు ఉండవచ్చని, తద్వారా కనీస మూలవేతనం నెలకు రూ.51,480కి పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఎస్‌కేవీ లా ఆఫీసర్స్ సీనియర్ అసోసియేట్ నీహాల్ భరద్వాజ్.. గత పే కమిషన్ల ద్వారా సంభవించిన వేతనాల పెంపును దృష్టిలో పెట్టుకొని చూస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు 25-30ు పెరిగే అవకాశం ఉందన్నారు. 2006-16 కాలవ్యవధికి సంబంధించి ఏర్పాటైన 6వ వేతన కమిషన్ వేతనాల్లో 40 శాతం పెంపునకు సిఫార్సు చేయగా, 2016-26కి సంబంధించిన 7వ వేతన కమిషన్ 23-25ు వేతన పెంపును సిఫార్సు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.