EPFO: మీ ఈపీఎఫ్ వ్యక్తిగత వివరాల్లో మార్పులు మీరే చేసుకోవచ్చు!
ABN , Publish Date - Jan 19 , 2025 | 04:11 AM
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎ్‌ఫఓ) సభ్యులు ఇక మీదట తమ ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న వ్యక్తిగత వివరాలను ఆన్‌లైన్‌లో తమంతటతామే మార్చుకోవచ్చు.
ఖాతా బదిలీ కూడా యజమాని ప్రమేయం లేకుండా ఆన్‌లైన్‌లోనే
ఈ-కేవైసీ, ఆధార్‌తో అనుసంధానం పూర్తయిన సభ్యులకే వర్తింపు
న్యూఢిల్లీ, జనవరి 18: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎ్‌ఫఓ) సభ్యులు ఇక మీదట తమ ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న వ్యక్తిగత వివరాలను ఆన్‌లైన్‌లో తమంతటతామే మార్చుకోవచ్చు. యజమాని ధ్రువీకరణగానీ, ఈపీఎ్‌ఫఓ ఆమోదంగానీ అవసరం లేదు. అంతేకాదు, యజమాని ప్రమేయం లేకుండానే ఈపీఎఫ్ ఖాతా బదిలీకి కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు ఈపీఎ్‌ఫఓలో కొత్త సేవలు శనివారం నుండి అందుబాటులోకి వచ్చాయి. వీటిని కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేరు, పుట్టినతేదీ, లింగం, జాతీయత, తల్లి/తండ్రి పేరు, భార్య/భర్త పేరు, ఈపీఎ్‌ఫలో చేరిన తేదీ, వైదొలిగే తేదీ వంటి వ్యక్తిగత వివరాల నమోదులో దొర్లే తప్పులను ఇక మీదట సభ్యులే స్వయంగా సరిదిద్దుకోవచ్చన్నారు. అయితే, ఆధార్ నెంబర్‌తో అనుసంధానిస్తూ 2017 అక్టోబరు 1వ తేదీ తర్వాత యూఏఎన్ (యూనివర్సల్ అకౌంట్ నెంబర్) జారీ అయిన సభ్యులకే ఇది వర్తిస్తుందని చెప్పారు. ఈ తేదీ కంటే ముందు యూఏఎన్ జారీ అయిన సభ్యుల వ్యక్తిగత వివరాల్లో సవరణలను.. వారు పని చేసే కంపెనీలే చేపట్టాల్సి ఉంటుందన్నారు.
ఈపీఎ్‌ఫఓ ఆమోదం అవసరం లేకుండానే ఈ మార్పులు జరుపుకోవచ్చని తెలిపారు. ఆధార్‌తో అనుసంధానించని ఖాతాల విషయంలో మాత్రం.. వ్యక్తిగత వివరాల్లో మార్పుల కోసం సంబంధిత ధ్రువీకరణ పత్రాలను యజమానికి అందజేస్తే, వాటిని యజమాని పరిశీలించి ఈపీఎ్‌ఫఓకు పంపించాల్సి ఉంటుందని.. ఈపీఎ్‌ఫఓ ఆమోదం తర్వాత మార్పులు నమోదవుతాయని మాండవీయ వెల్లడించారు. ఈపీఎఫ్ ఖాతా బదిలీ అంశంపై స్పందిస్తూ.. ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకున్న ఈపీఎఫ్ ఖాతాదారులు యజమాని ప్రమేయం లేకుండానే ఆధార్ ఓటీపీతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వ్యక్తిగత వివరాల్లో మార్పుల కోసంగానీ, ఖాతా బదిలీ కోసం గానీ ఇప్పటికే యజమానికి దరఖాస్తు చేసుకున్న వారు దానిని ఉపసంహరించుకొని, ఆన్‌లైన్‌లో తామే స్వయంగా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.