Share News

Delhi elections: ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికలు

ABN , Publish Date - Jan 08 , 2025 | 04:41 AM

దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల నగారా మోగింది. వచ్చేనెల 5న పోలింగ్‌ నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల కమిషన్‌(ఈసీఐ) మంగళవారం ప్రకటించింది.

Delhi elections: ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికలు

1.55 కోట్ల ఓటర్లు.. కొత్త వారు 2 లక్షల మంది

85 ఏళ్లు పైబడ్డ వారికి ఇంటివద్దే ఓటు: సీఈసీ’

న్యూఢిల్లీ, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల నగారా మోగింది. వచ్చేనెల 5న పోలింగ్‌ నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల కమిషన్‌(ఈసీఐ) మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నెల 10న గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు వివరించింది. ఆ తర్వాత నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. 17వ తేదీ వరకు నామినేషన్లకు అవకాశం ఉంటుంది. 18న నామినేషన్ల పరిశీలన(స్ర్కూటినీ) ఉంటుంది. 20వ తేదీలోపు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 5న పోలింగ్‌ను నిర్వహిస్తామని, 8న కౌంటింగ్‌, ఫలితాలు ఉంటాయని స్పష్టం చేసింది. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ వివరాలను వెల్లడించారు. ఢిల్లీలో 2 లక్షల మంది కొత్త ఓటర్లను కలుపుకొని 1.55 కోట్ల మంది ఓటర్లున్నట్లు ఈసీఐ వెల్లడించింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 12 సీట్లు ఎస్సీ రిజర్వ్డ్‌ క్యాటగిరీలో ఉన్నాయి. ‘‘ఢిల్లీలో మోడల్‌ కోడ్‌(ఎన్నికల నియమావళి) అమల్లోకి వచ్చింది. 85 ఏళ్లకు పైగా వయసున్న ఓటర్లకు ఇంటి వద్ద నుంచే ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నాం’’ అని ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ తెలిపారు. కాగా, ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన నేపథ్యంలో ‘‘పెద్ద ఎత్తున ఎన్నికలకు సిద్ధం కండి’’ అని ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ తమ పార్టీ కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. ‘‘ఫిర్‌ లాయింగే కేజ్రీవాల్‌(కేజ్రీవాల్‌ను మళ్లీ తీసుకొస్తాం)’’ అనే పాటను తమ ప్రచార గీతంగా ఆప్‌ ప్రకటించింది.

కేంద్రం నా అధికారిక నివాసాన్ని లాక్కుంది: అతీశీ

కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తన అధికారిక నివాసాన్ని లాక్కుందని ఢిల్లీ సీఎం ఆతిశీ మంగళవారం ఆరోపించారు. తనకు కేటాయించిన అధికారిక నివాసాన్ని ప్రజాపనుల శాఖ రద్దు చేయడంతో ఆమె ఈమేరకు ఆరోపించారు. అధికారిక నివాసం తనకో సమస్య కాదని, ఢిల్లీ ప్రజల కోసం వీధుల్లో ఉండయినా పనిచేయగలనని అన్నారు. అయితే, బీజేపీ ఈ ఆరోపణను తోసిపుచ్చింది. ఇచ్చిన గడువులోగా ఢిల్లీ సీఎం ఆ నివాసంలో చేరకపోవడం రద్దుకు ఒక కారణం కాగా.. సీబీఐ, ఈడీ విచారణలు మరో కారణమని తెలిపింది.

Updated Date - Jan 08 , 2025 | 04:41 AM