Share News

Election Commission: వారంలో అఫిడవిట్‌ ఇవ్వాలి.. లేదా క్షమాపణ చెప్పాలి

ABN , Publish Date - Aug 18 , 2025 | 05:32 AM

బీజేపీని గెలిపించేందుకు ఎన్నికల కమిషన్‌ ఓట్ల చోరీకి పాల్పడుతోందంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌గాంధీ సహా విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఈసీ ఘాటుగా స్పందించింది.

Election Commission: వారంలో అఫిడవిట్‌ ఇవ్వాలి.. లేదా క్షమాపణ చెప్పాలి

  • ఎన్నికల కమిషన్‌కు ఏ పార్టీ అయినా ఒకటే!

  • అధికార పక్షమా, ప్రతిపక్షమా అని చూడదు

  • ఎన్నికల్లో కోటి మందికిపైగా సిబ్బంది పాల్గొంటారు

  • వారందరి ముందూ ఓట్ల దొంగతనం సాధ్యమా?

  • రాజకీయ ప్రయోజనాల కోసం

  • ఈసీ భుజాలపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు

  • రాహుల్‌ ఆరోపణలపై సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ధ్వజం

  • బిహార్‌లో తొలగించిన 65 లక్షల మంది పేర్లతో

  • కూడిన జాబితాను వెబ్‌సైట్లలో పెట్టినట్టు వెల్లడి

  • ఈసీ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి: కాంగ్రెస్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): బీజేపీని గెలిపించేందుకు ఎన్నికల కమిషన్‌ ఓట్ల చోరీకి పాల్పడుతోందంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌గాంధీ సహా విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఈసీ ఘాటుగా స్పందించింది. ఈ ఆరోపణలను నిరూపించే సాక్ష్యాలతో వారంరోజుల్లోగా ప్రమాణపత్రాన్ని దాఖలు చేయాలని.. లేదా దేశానికి క్షమాపణ చెప్పాలని.. ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ రెండూ తప్ప మూడో ప్రత్యామ్నాయమే లేదని ఆయన స్పష్టం చేశారు. వారంలోగా ప్రమాణపత్రం సమర్పించకుంటే ఓటర్ల జాబితాపై వస్తున్న ఆరోపణలన్నీ ఆధారరహితమైనవిగా పరిగణించాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. అధికార పార్టీకి, ప్రతిపక్షానికి మధ్య ఈసీ ఎలాంటి తేడా చూపదని, తమకు ఏ రాజకీయ పార్టీ అయినా ఒక్కటేనని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ఢిల్లీలోని నేషనల్‌ మీడియా సెంటర్‌లో ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్‌ సింగ్‌ సంధు, వివేక్‌ జోషితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బిహార్‌లో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) చేపట్టినఉద్దేశమే.. ఓటర్ల జాబితాలో ఉన్న తప్పులను సవరించడమని, కానీ దీనిపై పలు పార్టీలు తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తూ వాస్తవికతను మరిచిపోతున్నాయని.. తమ ప్రయోజనాల కోసం ఎన్నికల కమిషన్‌ భుజాలపై తుపాకీ పెట్టి ఓటర్లను లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఆయన మండిపడ్డారు. ఓట్ల చోరీ, డబుల్‌ ఓటింగ్‌ వంటి ఆరోపణలకు ఎలాంటి ఆధారాలూ లేవని ఆయన కొట్టిపారేశారు. ‘ఓట్ల చోరీ’ వంటి పదాలు ఉపయోగించడం రాజ్యాంగాన్ని అవమానపరచడమేనని జ్ఞానేశ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిహార్‌లో ఎస్‌ఐఆర్‌ కార్యక్రమాన్ని హడావుడిగా జరిపేస్తున్నారన్న వాదన పస లేనిదని.. ప్రతి ఎన్నికకు ముందూ ఓటరు జాబితాను సరిదిద్దడం ఎన్నికల కమిషన్‌ చట్టబద్ధమైన విధి అని స్పష్టం చేశారు. ఓటర్ల డేటా బేస్‌లో తప్పులు సవరించాలని అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్‌ చేయడం వల్లే ఈ ప్రక్రియ చేపట్టినట్టు వెల్లడించారు. బిహార్‌లో ముసాయిదా ఓటరు జాబితాపై ఏవైనా అభ్యంతరాలుంటే తెలపడానికి, ఫిర్యాదులుంటే చేయడానికి అన్ని రాజకీయ పార్టీలకూ ఇంకా 15 రోజుల గడువు ఉందని గుర్తుచేశారు. ‘‘ఈసీ తలుపులు అందరికీ తెరిచేఉంటాయి. బూత్‌ స్థాయి అధికారులు, ఏజెంట్లు పారదర్శకంగా పనిచేస్తున్నారు’’ అని ఆయన పేర్కొన్నారు. బిహార్‌లో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి బూత్‌ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు, పూర్తి స్థాయిలో పారదర్శకంగా పనిచేస్తున్నారని తెలిపారు.


సాధ్యమేనా?

కోటి మంది అధికారులు, పది లక్షల మంది బూత్‌ స్థాయి అధికారులు, ఇరవై లక్షల మంది పోలింగ్‌ ఏజెంట్లు ఒక లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటారని.. ఇంతమంది ముందు ఓట్లను దొంగతనం చేయడం సాధ్యమవుతుందా? అని సీఈసీ ప్రశ్నించారు. రెండుసార్లు ఓటింగ్‌ జరిగినట్లు ఆరోపణలు చేసిన వారిని రుజువులు అడిగితే.. ఇప్పటివరకూ తమకు సమర్పించలేదని తెలిపారు. ఇలాంటి ఆరోపణల వల్ల ఎన్నికల కమిషన్‌ కానీ, ఓటర్‌ కానీ భయపడరని అన్నారు. ఓటర్లను అవమానపరిస్తే ఎన్నికల కమిషన్‌ మౌనంగా ఉండదని హెచ్చరించారు. వలసల వల్లో, ఇతరత్రా కారణాలవల్లనో, అధికార యంత్రాంగం పనితీరులో లోపాలవల్లనో ఒక ఓటరు ఒకటికి మించి ఓటరు గుర్తింపు కార్డులు కలిగి ఉంటున్న సందర్భాలు కనిపిస్తున్నాయని.. అలాంటి తప్పులను పరిష్కరించేందుకే ఈసీ ప్రత్యేక సమగ్ర సవరణ చేపడుతోందని జ్ఞానేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. అలాగే.. విపక్షాలు లేవనెత్తిన ‘హౌస్‌ నంబర్‌ జీరో’ సమస్యపైనా ఆయన స్పందించారు. ‘‘చాలామంది ఓటర్లకు ఇళ్లు ఉండవు. కానీ, వారి పేరు జాబితాలో ఉంటుంది. జాబితాలో ఇచ్చిన చిరునామాకు వారు కేవలం రాత్రిపూట నిద్రించడానికి వస్తారు. కొందరైతే రోడ్లపక్కన, వంతెనల కింద పడుకుంటారు. అలాంటివారిని ఫేక్‌ ఓటర్లంటే.. ఆ పేద ఓటర్లను హేళన చేసినట్టే’’ అని ఆవేదన వెలిబుచ్చారు. పంచాయతీలు, మునిసిపాలిటీలు ఇళ్లకు నంబర్‌ కేటాయించకపోవడం వల్ల.. కోట్లాది మంది ఓటర్ల ఇంటి నంబర్‌ ‘జీరో’గా ఉంటోందని పేర్కొన్నారు. ఉదాహరణకు.. నగరాల్లో అనుమతులులేని కాలనీలు చాలా ఉంటాయని, ఆ కాలనీల్లో ఉండేవారికి ఇంటినంబర్లు ఉండవని(అధికారులు కేటాయించరని).. అలాంటివారు ఓటరు ఐడీ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు చిరునామా అనే చోట ఏం రాస్తారని నిలదీశారు. అలాంటి సందర్భాల్లో వారి ఇంటినంబర్‌ స్థానంలో ఊహాత్మక సంఖ్య ఇవ్వడం ద్వారా అలాంటి ఓటర్ల పక్షాన ఈసీ నిలబడుతుందన్నారు.


అలా ఇవ్వం..

సుప్రీంకోర్టు ఆదేశించినట్టుగా.. బిహార్‌లో ముసాయిదా ఓటరు జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది పేర్లను, వారి వివరాలను జిల్లాలవారీగా ఈసీ వెబ్‌సైట్లలో ప్రచురించినట్టు సీఈసీ తెలిపారు. అయితే.. యంత్రాల సాయంతో చదవదగ్గ రీతిలో (మెషీన్‌ రీడబుల్‌) ఓటర్ల జాబితాను విడుదల చేస్తే ఓటర్ల ప్రైవసీకి భంగం కలుగుతుందని 2019లో సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. మెషీన్‌ రీడబుల్‌ ఫార్మాట్‌ని ఎవరైనా ఎడిట్‌ చేసే (మార్చే) ప్రమాదం ఉంటుంది కాబట్టే దాన్ని నిషేధించారని తెలిపారు. కనుక ఆ నమూనాలో ఓటరు జాబితాను రాజకీయ పార్టీలతో పంచుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ఎన్నికల నిబంధనావళిలోని క్లాజ్‌ నంబరు 11.2.2.2లో సైతం ఓటరు జాబితా ‘టెక్స్ట్‌ మోడ్‌’లో ఉండాలని మాత్రమే పేర్కొన్నారని.. ముసాయిదా ఓటర్ల జాబితాను ‘సెర్చబుల్‌ (ఓటరు గుర్తింపు కార్డు నంబర్‌తో వెతకగలిగే) పీడీఎఫ్‌’ రూపంలో ఈసీ వెబ్‌సైట్‌లో పెట్టాలని చెప్పలేదని గుర్తుచేశారు. కాబట్టి అలా పెట్టాలని అడిగే హక్కు పిటిషనర్‌కు లేదని జ్ఞానేశ్‌కుమార్‌ పేర్కొన్నారు.


ఈసీ తీరు బహిర్గతమైంది..

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌నేత జైరామ్‌రమేశ్‌ స్పందించారు. ‘‘సాసారాం నుంచి రాహుల్‌ గాంధీ ‘ఓటర్‌ అధికార యాత్ర’ ప్రారంభించిన కొద్దిసేపటికే సీఈసీ, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు మీడియాతో మాట్లాడుతూ.. తమకు అధికార, ప్రతిపక్షాల మధ్య తేడా లేదన్నారు. కొండంత సాక్ష్యాలు ఎదురుగా ఉన్నా వారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదం. రాహుల్‌గాంధీ లేవనెత్తిన ఏ ఒక్క నిశితమైన ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వలేదు’’ అని తన ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్‌ చేశారు. బిహార్‌లో తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల పేర్లను, వారిని తొలగించడానికి గల కారణాలతో సహా వెల్లడించాలంటూ ఆగస్టు 14వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈసీ తూచాతప్పకుండా పాటిస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. ఈసీ ఇచ్చిన డేటాలోని వాస్తవాలనే రాహుల్‌ చెప్పారని గుర్తుచేశారు. అసమర్థతవల్లే కాక.. బహిరంగ పక్షపాతవైఖరి వల్ల కూడా ఈసీ తీరు పూర్తిగా బహిర్గతమైందన్నారు.


అందుకే రాహుల్‌ను అఫిడవిట్‌ అడిగారు

ఒక నియోజకవర్గంలో ఓటర్‌ కానివారు ఓటరుజాబితాపై ఫిర్యాదు చేయాలంటే.. ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ ముందు ప్రమాణం చేయాల్సి ఉంటుందని సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ తెలిపారు. ఎవరిపై ఆరోపణలు చేస్తారో వారి ముందే ప్రమాణం చేయాల్సి ఉంటుందని.. అందుకే కర్ణాటక సీఈవో రాహుల్‌ గాంధీని ప్రమాణ పూర్వకంగా డిక్లరేషన్‌ సమర్పించాలని కోరారని ఆయన వివరణ ఇచ్చారు. ఫిర్యాదుదారు ప్రమాణపూర్వక డిక్లరేషన్‌ ఇవ్వకుండా ఈసీ 1.5 లక్షల మంది ఓటర్లకు నోటీసు జారీ చేయాలా? అని ప్రశ్నించారు.

Updated Date - Aug 18 , 2025 | 05:54 AM