The Election Commission: సోషల్ మీడియా ప్రకటనలకూ ముందస్తు అనుమతి తప్పనిసరి
ABN , Publish Date - Oct 15 , 2025 | 04:54 AM
రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తాము జారీ చేసే ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి చేస్తూ భారత ఎన్నికల సంఘం...
నామినేషన్ పత్రాలు వేసేటప్పుడే అధికారిక ‘ఖాతాల’ వివరాలనూ ఇవ్వాలి
ఈసీ ఉత్తర్వులు జారీ
న్యూఢిల్లీ, అక్టోబరు 14: రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తాము జారీ చేసే ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి చేస్తూ భారత ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఎలకా్ట్రనిక్, వెబ్, సోషల్ మీడియాల్లో జారీ చేసే అన్ని ప్రకటనలకూ ఈ నిబంధన వర్తిస్తుందని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. బిహార్, జమ్మూ కశ్మీర్, ఆరు రాష్ట్రాల్లోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఆ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించే క్రమంలో ఈసీ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీలు(ఎంసీఎంసీ) రాష్ట్ర, జిల్లా స్థాయిలోనూ ఏర్పాటు అవుతాయని పేర్కొంది. పార్టీలు, అభ్యర్థులు ప్రింట్, ఎలకా్ట్రనిక్, వెబ్, ఇంటర్నెట్ వేదికగా జారీ చేసే అన్ని ప్రకటనలకూ పై కమిటీల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. అలాగే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 75 రోజుల తరువాత సమర్పించే లెక్కల్లో కూడా ప్రకటనల నిమిత్తం వివిధ సంస్థలకు చేసిన చెల్లింపులనూ చెప్పాల్సిందేనని పేర్కొంది. నామినేషన్లు వేసేటప్పుడే ఆయా పార్టీలు, అభ్యర్థుల అధికారిక సోషల్ మీడియా ఖాతాల వివరాలను, వెబ్ ప్లాట్ ఫాం వివరాలనూ ఇవ్వవలసిందేనని వివరించింది. ఈసీకి సమర్పించే లెక్కల్లో కంటెంట్ క్రియేషన్ కోసం చేసిన ఖర్చును కూడా జత చేయాలంది. ఎంసీఎంసీ వివిధ మీడియాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుందని, పెయిడ్ న్యూస్ అని అనుమానం వచ్చిన వాటిపై చర్యలు తీసుకుంటుందని ఈసీ స్పష్టం చేసింది.