Share News

Election Commission: ఓటర్లకు బర్త్‌ సర్టిఫికెట్‌ ఇక తప్పనిసరి!

ABN , Publish Date - Jun 26 , 2025 | 05:16 AM

ఓటర్లకు పుట్టిన తేదీ, జన్మించిన ప్రదేశంతో కూడిన ధ్రువపత్రాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది.

Election Commission: ఓటర్లకు బర్త్‌ సర్టిఫికెట్‌ ఇక తప్పనిసరి!

  • ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

  • ఓటర్ల జాబితా నుంచి అనర్హులు, అక్రమ వలసదారులను తొలగించడమే లక్ష్యం

  • ఈ ఏడాది బిహార్‌, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, బెంగాల్‌లలో అమలు

న్యూఢిల్లీ, జూన్‌ 25: ఓటర్లకు పుట్టిన తేదీ, జన్మించిన ప్రదేశంతో కూడిన ధ్రువపత్రాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఓటరు జాబితాలో అనర్హులు, అక్రమ వలసదారులను ఏరివేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. దీనికిగాను ఓటర్ల జాబితాలో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎ్‌సఐఆర్‌)ను ప్రారంభించింది. 2003లోనే ఎస్‌ఐఆర్‌ను నిర్వహించారు. అయితే.. అప్పట్లో ఆయా వివరాలు ఇవ్వని వారు ఇప్పుడు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందని ఈసీ పేర్కొంది. ముఖ్యంగా 1987, జూలై 1కి ముందు జన్మించిన వారు తమ పుట్టిన తేదీ, జన్మించిన ప్రాంతానికి సంబంధించిన రుజువులను ఓటరు జాబితాలో చేర్చాల్సి ఉంటుంది.


ఈ ప్రక్రియను బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల నుంచే ప్రారంభించనున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. 2003 నుంచే ఈ ప్రక్రియను ప్రారంభించామని.. అప్పట్లో నమోదు కాని వారు ఇప్పుడు ఖచ్చితంగా తమ వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొంది. 1987 కంటే ముందు జన్మించిన వారు.. తమ పుట్టిన తేదీ, ప్రదేశంతోపాటు భారత పౌరుడనని పేర్కొంటూ స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని అందించాలి. 2004, డిసెంబరు 2 తర్వాత జన్మించిన వారు వారి తల్లిదండ్రుల పేర్లతో కూడిన జనన ధ్రువీకరణ పత్రాలను ఇవాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికెట్లను వ్యక్తిగతంగా బీఎల్‌వోలకు, లేదా ఆన్‌లైన్‌లో అయిన సమర్పించవచ్చు. వీటి ఆధారంగా అనర్హులు, అక్రమ వలసదారులను జాబితాల నుంచి తొలగించనున్నట్టు ఈసీ వివరించింది.

Updated Date - Jun 26 , 2025 | 05:16 AM