Share News

Election Commission: గల్లంతైన ఓటర్ల జాబితా ప్రచురించాలనే నిబంధన లేదు

ABN , Publish Date - Aug 11 , 2025 | 02:53 AM

ముసాయిదా ఓటర్ల జాబితాలో గల్లంతైన వారి పేర్లతో ప్రత్యేకంగా ఒక జాబితాను ప్రచురించాలనే నిబంధనలేమీలేవని

Election Commission: గల్లంతైన ఓటర్ల జాబితా ప్రచురించాలనే నిబంధన లేదు

  • కారణాలు వెల్లడించాలనే నిబంధనలు కూడా లేవు

  • అలాంటి జాబితా అడిగే హక్కు పిటిషనర్లకు లేదు

  • సుప్రీంకోర్టుకు తెలిపిన ఎన్నికల కమిషన్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 10: ముసాయిదా ఓటర్ల జాబితాలో గల్లంతైన వారి పేర్లతో ప్రత్యేకంగా ఒక జాబితాను ప్రచురించాలనే నిబంధనలేమీలేవని భారత ఎన్నికల కమిషన్‌(ఈసీఐ) స్పష్టంచేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో శనివారం అదనపు అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్న బిహార్‌లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సర్వే (ఎ్‌సఐఆర్‌) చేపట్టిన ఈసీ 65 లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించింది. వారంతా చనిపోయిన లేదా వలసపోయినవారు అని పేర్కొంది. 7.24 కోట్ల మందితో కూడిన ముసాయిదా ఓటర్ల జాబితాను ఈసీ ప్రచురించింది. బిహార్‌ ఎస్‌ఐఆర్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లన్నింటిపై జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈనెల 12న ఈ పిటిషన్లపై మరోసారి విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో పేర్లు గల్లంతైన వ్యక్తుల జాబితాను ప్రచురించాలని కోరుతూ అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) దాఖలు చేసిన పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ఈసీఐ తాజా అఫిడవిట్‌ను దాఖలు చేసింది. కారణాలు వెల్లడించకుండా 65లక్షల మంది పేర్లు తొలగించారంటూ ఏడీఆర్‌ చేసిన ఆరోపణకు స్పందనగా సుప్రీంకోర్టులో ఈసీ ఐ దాఖలు చేసిన మూడో అఫిడవిట్‌ ఇది. జాబితాలో పేరు చేర్చకపోవడానికి కారణం వెల్లడించాల్సిన అవసరంలేదని ఈసీఐ పేర్కొంది. తొలగించిన ఓటర్ల పేర్లతో జాబితా కావాలని అడిగే హక్కు పిటిషనర్లకు లేదంది. ముసాయిదా జాబితాలో వ్యక్తుల పేర్లు చేర్చకపోవడానికి కారణాలు వెల్లడించాలని నిబంధనల్లో లేదని తెలిపింది. జాబితాలో పేరులేని వారు తమ పేరు చేర్చాలని డిక్లరేషన్‌ సమర్పించేందుకు అవకాశం ఉందని, అలాంటి ఓటర్లు సంబంధిత పత్రాలు సమర్పించేందుకు సహేతుకమైన అవకాశం కల్పిస్తామని తెలిపింది. అందువల్ల ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లన్నింటినీ కొట్టివేయాలని ఈసీఐ కోరిం ది. ముందస్తు నోటీసు జారీ చేయకుండా, సంబంధిత అధికారి నుంచి సహేతుకమైన ఆదేశంలేకుండా ఏ ఒక్కరి పేరూ 2025 ఆగస్టు 1న ప్రచురించిన బిహార్‌ ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించమని ఈసీఐ పేర్కొంది. ‘బిహార్‌ ఎస్‌ఐఆర్‌ కేసులో పిటిషనర్లు కోర్టును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. వారందరిపై భారీగా జరిమానాలు విధించాల్సి ఉంది’ అని పేర్కొంది.

Updated Date - Aug 11 , 2025 | 02:53 AM