Share News

KC Veerendra: బెట్టింగ్‌ కేసులో కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వీరేంద్ర అరెస్ట్‌

ABN , Publish Date - Aug 24 , 2025 | 01:05 AM

ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ బెట్టింగ్‌ కేసులో కర్ణాటకలోని చిత్రదుర్గ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కేసీ వీరేంద్ర పప్పీని మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఈడీ అధికారులు అరెస్ట్‌ చేశారు.

KC Veerendra: బెట్టింగ్‌ కేసులో కర్ణాటక  కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వీరేంద్ర అరెస్ట్‌

బెంగళూరు, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ బెట్టింగ్‌ కేసులో కర్ణాటకలోని చిత్రదుర్గ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కేసీ వీరేంద్ర పప్పీని మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఈడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. క్యాసినో లీజు వ్యవహారంపై మాట్లాడేందుకు తన అనుచరులతో కలసి సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌కు వెళ్లిన ఆయనను శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. పలు రాష్ట్రాల్లో దాడులు చేసి విదేశీ కరెన్సీ సహా 12 కోట్ల రూపాయల నగదు, రూ.6 కోట్ల విలువైన బంగారం, 10 కిలోల వెండితో పాటు నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.


గ్యాంగ్‌టక్‌లో స్థానిక మేజిస్ట్రేట్‌ ముందు ఆయన్ను హాజరుపరిచి, ట్రాన్సిట్‌ రిమాండ్‌తో కర్ణాటకకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చిత్రదుర్గ జిల్లా చెళ్లకెరెలోని వీరేంద్రతో పాటు ఆయన సోదరులు కేసీ తిప్పేస్వామి, కేసీ నాగరాజ్‌ నివాసాలపైనా ఈడీ దాడులు చేశారు. బెంగళూరు, హుబ్బళ్లి, జోధ్‌పూర్‌ (రాజస్థాన్‌), ముంబై, సిక్కిం, గోవాలోని ఐదు క్యాసినోలతో కలిపి 31 చోట్ల దాడులు జరిగాయి. ఈడీ దాడులు, ఎమ్మెల్యే అరెస్టు గురించి సీఎం సహా కాంగ్రెస్‌ నాయకులు ఎవరూ స్పందించలేదు.

Updated Date - Aug 24 , 2025 | 01:05 AM