Election Commission: పోలింగ్ స్టేషన్ దాకా మొబైల్ తీసుకెళ్లొచ్చు!
ABN , Publish Date - May 24 , 2025 | 05:58 AM
పోలింగ్ రోజున ఓటర్లు తమ ఫోన్లను పోలింగ్ స్టేషన్ దాకా తీసుకువెళ్లడానికి ఎన్నికల సంఘం(ఈసీ) వెసులుబాటు కల్పించింది.
న్యూఢిల్లీ, మే 23: పోలింగ్ రోజున ఓటర్లు తమ ఫోన్లను పోలింగ్ స్టేషన్ దాకా తీసుకువెళ్లడానికి ఎన్నికల సంఘం(ఈసీ) వెసులుబాటు కల్పించింది. అయితే, వాటిని పోలింగ్ స్టేషన్ నుంచి 100 మీటర్ల దూరంలోనే స్విచ్ఛాఫ్ చేయాలని సూచించింది. ఓటు వేసే ముందు ఫోన్లను పోలింగ్ స్టేషన్ వెలుపల ఏర్పాటు చేసే కౌంటర్లలో దాచిపెట్టాలని తెలిపింది. ఈ మేరకు శుక్రవారం మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రజలకు ఫోన్ అవసరాలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఇంతకుముందు పోలింగ్ స్టేషన్ నుంచి 100మీటర్ల దూరం వరకు మొబైల్ ఫోన్లపై నిషేధం ఉండేది. మరోవైపు, ఓటర్లకు వోటర్ స్లిప్పులు అందించడానికి, బూత్ నంబర్లు చెప్పడానికి రాజకీయ పార్టీలు పోలింగ్ స్టేషన్ నుంచి 100మీటర్ల ఆవల బూత్‌లను ఏర్పాటు చేసుకోవచ్చని ఈసీ తెలిపింది. ఇంతకుముందు ఈ పరిధి 200మీటర్లుగా ఉంది.