Election Commission of India: ఎస్‌ఐఆర్ అత్యంత కచ్చితం
ABN , Publish Date - Oct 17 , 2025 | 04:32 AM
బిహార్‌లో చేపట్టిన ఓటరు సమగ్ర సవరణ ప్రక్రియ (ఎస్‌ఐఆర్) అత్యంత కచ్చితంగా జరిగిందని ఎన్నికల....
దురుద్దేశంతోనే పార్టీలు, ఎన్జీవోలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయ్.. సుప్రీంకోర్టులో ఈసీ వాదనలు
న్యూఢిల్లీ, అక్టోబరు 16: బిహార్‌లో చేపట్టిన ఓటరు సమగ్ర సవరణ ప్రక్రియ (ఎస్‌ఐఆర్) అత్యంత కచ్చితంగా జరిగిందని ఎన్నికల సంఘం (ఈసీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆ ప్రక్రియను అప్రతిష్ఠపాలు చేయాలనే దురుద్దేశంతోనే కొన్ని రాజకీయపార్టీలు, స్వచ్ఛంద సంస్థలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని పేర్కొంది. ఓటర్ల తుది జాబితాను ప్రకటించిన తర్వాత.. తొలగింపునకు గురైన పేర్లను సవాల్ చేస్తూ ఒక్క ఓటరు కూడా ఇప్పటి వరకూ అప్పీల్ దాఖలు చేయలేదని వెల్లడించింది. ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ల మీద విచారణను సుప్రీంకోర్టు గురువారం కొనసాగించింది. ఈ సందర్భంగా ఈసీ ధర్మాసనానికి అఫిడవిట్ సమర్పించింది. ఎస్‌ఐఆర్ నిర్వహణకు 90 వేల మందికిపైగా బూత్ స్థాయి అధికారులను నియమించామని, ఒక్కో ఇంటిని ఒకటికన్నా ఎక్కువసార్లు సిబ్బంది సందర్శించి వివరాలు సేకరించారని ఆ అఫిడవిట్‌లో ఈసీ పేర్కొంది. తుది జాబితాలో 3.66 లక్షల పేర్లు తొలగించామని, అయినప్పటికీ, ఒక్క ఓటరు కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదని, కాబట్టి, మొత్తం ప్రక్రియ అత్యంత కచ్చితంగా జరిగినట్లు భావించవచ్చని తెలిపింది. తొలగించిన పేర్లలో 34ు ముస్లింలవేనని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, యోగేంద్రయాదవ్ (ఈ కేసులో పిటిషనర్లు) చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని పేర్కొంది. బిహార్‌లో ఎన్నికల నేపథ్యంలో రాజకీయపార్టీల ప్రతినిధులు విచారణకు హాజరుకాకపోవటాన్ని ప్రస్తావిస్తూ.. ధర్మాసనం తదుపరి విచారణను నవంబరు 4వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ముఖంపై కొంగు కప్పుకున్న, బుర్ఖా ధరించిన మహిళా ఓటర్ల గుర్తింపును పోలింగ్‌బూత్‌లలో తనిఖీ చేయాల్సిందేనన్న తన ఆదేశాలను ఈసీ సమర్థించుకుంది. ఈ ఆదేశాలపై కొన్ని రాజకీయపార్టీలు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈసీ గురువారం స్పందించింది.