COVID-19: బెడ్లు ఖాళీ లేకుంటే.. ఆ పేషెంట్‌ని చంపెయ్
ABN , Publish Date - May 30 , 2025 | 06:15 AM
బెడ్లు ఖాళీ లేకుంటే ఆ పేషెంట్‌ను చంపెయ్’ అంటూ ఒక వైద్యుడు మరో వైద్యుడికి సలహా ఇచ్చాడు 2021లో కొవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో.. మహారాష్ట్రలోని లాతూర్‌లో జరిగిందీ ఘటన.
మహారాష్ట్రలోని లాతూర్‌లో తోటి వైద్యుడికి సర్జన్ సలహా
2021 నాటి ఆడియో.. మే 2 నుంచి వైరల్
లాతూర్, మే 29: ‘బెడ్లు ఖాళీ లేకుంటే ఆ పేషెంట్‌ను చంపెయ్’ అంటూ ఒక వైద్యుడు మరో వైద్యుడికి సలహా ఇచ్చాడు!! 2021లో కొవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో.. మహారాష్ట్రలోని లాతూర్‌లో జరిగిందీ ఘటన. లాతూర్‌కు చెందిన కౌసర్ ఫాతిమా అనే మహిళ కొవిడ్ బారిన పడడంతో.. ఆమె భర్త దయామీ అజీమొద్దీన్ గౌసుద్దీన్ ఆమెను 2021 ఏప్రిల్ 15న ఉద్గిర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ కొవిడ్ పేషెంట్లకు డాక్టర్ శశికాంత్ డాంగే వైద్యం చేశారు. ఆ ఆస్పత్రిలో ఆమె పదిరోజులపాటు చికిత్స చేయించుకుని డిశ్చార్జ్ అయ్యా రు. అయితే.. ఏడో రోజున కౌసర్ ఫాతిమా భర్త దయామీ డాక్టర్ శశికాంత్ డాంగే వద్ద ఉన్న సమయంలో.. డాక్టర్ డాంగేకు సీనియర్ సర్జన్ డాక్టర్ శశికాంత్ దేశ్‌పాండే నుంచి ఫోన్ వచ్చింది. ఆ సమయంలో డాక్టర్ డాంగే భోజనం చేస్తుండడంతో.. ఫోన్‌ను స్పీకర్‌లో పెట్టి మాట్లాడారని, దీంతో వారి మాటల్లో కొన్ని తనకు కొంత అస్పష్టంగా వినిపించాయని ఫాతిమా భర్త దయామీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆయన ఫిర్యాదు ప్రకారం.. ఆస్పత్రిలో పడకలు ఏవైనా ఖాళీగా ఉన్నాయా అని ప్రశ్నించారు. దీనికా డాక్టర్ డాంగే.. ఖాళీ పడకలేవీ లేవని బదులిచ్చారు. అప్పు డు దేశ్‌పాండే.. ‘‘ఎవర్నీ లోపలికి రానివ్వొద్దు (చేర్చుకోవద్దు). ఆ దయా మీ పేషెంట్‌ని చంపెయ్’’ అన్నట్టుగా తనకు వినపడిందని దయామీ తన ఫిర్యాదులో వివరించారు. దీనికి డాక్టర్ డాంగే.. అప్పటికే ఆక్సిజన్ సపోర్టు తగ్గించినట్టు సమాధానమిచ్చారని తెలిపారు. ఇప్పుడు ఆ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. తనను నాడు ఎంతగానో కలచివేసిన ఆ వ్యాఖ్యలు మళ్లీ విని బాధపడ్డానని, తన మతపరమైన మనోభావాలు దెబ్బతిన్నాయని ఫిర్యాదులో వెల్లడించారు. ఆయన ఫిర్యాదు మేరకు ఉద్గిర్ నగర పోలీసులు మే 24న డాక్టర్ దేశ్‌పాండేపై కేసు నమోదు చేశారు. వైరల్ అవుతున్న ఆడియో క్లిప్‌లో ఉన్నది ఆయన స్వరమేనా అని నిర్ధారించుకునే పనిలో ఉన్నామని పోలీసులు తెలిపారు.