Share News

DMKs Tiruchi Siva : ఉపరాష్ట్రపతి పదవికి ఇండియా అభ్యర్థి తిరుచీ శివ

ABN , Publish Date - Aug 19 , 2025 | 03:04 AM

ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన డీఎంకే రాజ్యసభ సభ్యుడు తిరుచీ శివను ఎంపికచేసినట్టు తెలిసింది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నాయకత్వంలో జరిగే పక్షాల భేటీలో ఆయన పేరును ఖరారు...

DMKs Tiruchi Siva : ఉపరాష్ట్రపతి పదవికి ఇండియా అభ్యర్థి తిరుచీ శివ

  • తమిళనాడు డీఎంకే ఎంపీ పేరు తెరపైకి

  • ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్‌కు పోటీగా ఇండియా కూటమి వ్యూహాత్మక నిర్ణయం

  • నామినేషన్ల దాఖలుకు 22 వరకు గడువు

న్యూఢిల్లీ, ఆగస్టు 18: ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన డీఎంకే రాజ్యసభ సభ్యుడు తిరుచీ శివను ఎంపికచేసినట్టు తెలిసింది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నాయకత్వంలో జరిగే పక్షాల భేటీలో ఆయన పేరును ఖరారు చేస్తారని సమాచారం. అధికార ఎన్డీయే కూటమి ఉపరాష్ట్రపతి పదవికి ఇప్పటికే తమ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ పేరును ఖరారుచేసిన విషయం తెలిసిందే. దక్షిణాదిలో, అందులోనూ తమిళనాడులో బలహీనంగా ఉన్న బీజేపీ ఆ రాష్ట్రం నుంచి అభ్యర్థిని ఎంపిక చేసింది. త్వరలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్డీయే వేసిన ఈ ఎత్తుకు ఇండియా కూటమి పై ఎత్తును వేయాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే శివ పేరు తెరపైకి వచ్చింది. రాధాకృష్ణన్‌ అభ్యర్థిత్వంతో ప్రాంతీయంగా తలెత్తే రాజకీయ సమస్యను దీనివల్ల అధిగమించవచ్చునని ఇండియా శిబిరం భావిస్తోంది. అలాగే.. తమిళనాడుకు చెందిన నేతను ఎంపిక చేయడం వల్ల దక్షిణాది రాష్ట్రాల నుంచి అదనపు మద్దతు పొందవచ్చుననేది ఒక ఆలోచన. బీజేపీయా మరొకటా అనేది పక్కనపెడితే తమిళనాడు నుంచి ఒకరు ఉపరాష్ట్రపతి అవుతున్నారంటే.. డీఎంకే సైతం వ్యతిరేకించడానికి ఉండదు. అదేగనుక తమ పార్టీ నేతే పోటీకి నిలబడితే ఈ సమస్య తలెత్తదని డీఎంకే, ఇతర విపక్ష పార్టీలు ఆలోచించినట్టు తెలిసింది. మరోవైపు, రాధాకృష్ణన్‌ అభ్యర్థిత్వం విషయంలో తమిళనాడులోని అధికార డీఎంకే కూటమిలో చీలిక తలెత్తింది. ఆయనకు మద్దతు ఇచ్చేది లేదని ఈ కూటమికి నాయకత్వం వహిస్తున్న డీఎంకే ఇప్పటికే తేల్చేయగా, భాగస్వామ్య పక్షం ఎమ్‌డీఎంకే మాత్రం రాధాకృష్ణన్‌కు అభినందనలు తెలిపింది. కాగా, ఇండియా కూటమిలో ఉంటూ, ఎన్డీయే అభ్యర్థికి తాము ఎలా మద్దతు ఇస్తామని డీఎంకే అధికార ప్రతినిధి ఎలన్‌గోవన్‌ మీడియాను ప్రశ్నించారు. రాధాకృష్ణన్‌తో తమిళనాడుకు ప్రయోజనం ఏమీ ఉండబోదన్నారు.

Updated Date - Aug 19 , 2025 | 03:04 AM