Delhi Police: కాల్పుల్ని పసిగట్టే సెన్సార్లు.. అటు జూమ్ చేసే కెమెరాలు
ABN , Publish Date - Jun 23 , 2025 | 04:38 AM
ఢిల్లీలో పెరుగుతున్న తుపాకీ హింసను నియంత్రించేందుకు పోలీసులు నడుం బిగించారు. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఓ కొత్త నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.
ఢిల్లీలో కొత్త వ్యవస్థ ఏర్పాటు
న్యూఢిల్లీ, జూన్ 22: ఢిల్లీలో పెరుగుతున్న తుపాకీ హింసను నియంత్రించేందుకు పోలీసులు నడుం బిగించారు. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఓ కొత్త నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా అడ్వాన్స్‌డ్ సెన్సార్లు, హై-రెజల్యూషన్ కెమెరాలను ఉపయోగించనున్నారు. 500 మీటర్ల నుంచి ఒక కిలోమీటరు పరిధిలో జరిగిన కాల్పులను గుర్తించ గల ఈ సెన్సార్లను నగరంలోని వ్యూహాత్మక ప్రదేశాల్లో అమరుస్తున్నారు.
ఈ సెన్సార్లు కాల్పుల శబ్దాన్ని పసిగట్టిన వెంటనే, దగ్గర్లోని పీటీజెడ్ (పాన్-టిల్ట్-జూమ్) కెమెరాలకు సిగ్నల్ పంపుతాయి. ఆ కెమెరాలు వెంటనే కాల్పులు జరిగిన దిశగా తిరిగి, ఘటన మొత్తాన్ని రికార్డు చేస్తాయి. అంతేకాకుండా దాడి చేసిన వారిని, వారు పారిపోవడానికి ఉపయోగించిన వాహనాలను గుర్తించడానికి సహాయ పడతాయి. ఈ వ్యవస్థలో ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు కూడా ఉంటాయి.