Share News

Former IAS Officer: రూ. 4000కోట్ల ఢిల్లీ హౌసింగ్‌ సొసైటీ స్కాం కేసులో

ABN , Publish Date - Nov 06 , 2025 | 04:10 AM

దాదాపు నాలుగు వేల కోట్ల ఢిల్లీ హౌసింగ్‌ సొసైటీ కుంభకోణంలో.. మాజీ ఐఏఎస్‌ సహా 13 మంది నిందితులకు ఢిల్లీ కోర్టు శిక్షలు ఖరారు చేసింది.

Former IAS Officer: రూ. 4000కోట్ల ఢిల్లీ హౌసింగ్‌ సొసైటీ స్కాం కేసులో

  • మాజీ ఐఏఎ్‌సకు 5 ఏళ్ల జైలుశిక్ష

  • మరో 12మందికి శిక్షలు ఖరారు

న్యూఢిల్లీ, నవంబరు 5: దాదాపు నాలుగు వేల కోట్ల ఢిల్లీ హౌసింగ్‌ సొసైటీ కుంభకోణంలో.. మాజీ ఐఏఎస్‌ సహా 13 మంది నిందితులకు ఢిల్లీ కోర్టు శిక్షలు ఖరారు చేసింది. వీరికి ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్షలు విధించినట్లు ప్రకటించింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు 2006లో సీబీఐ ఈ కేసు విచారణ ప్రారంభించగా, దాదాపు 25సంవత్సరాల తర్వాత ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ప్రశాంత్‌ వర్మ అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద నిందితులకు శిక్షలు విధించారు. తీర్పు సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ, అవినీతిని ఉక్కుపాదంతో అణిచివేయాలన్నారు. అవినీతిని సమాజ ఆరోగ్యానికి ముప్పు ను కలిగించే క్యాన్సర్‌తో పోల్చిన ఆయన, నయం చేయడానికి కీమోథెరపీ వంటి కఠినమైన చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. కేసు నేపథ్యాన్ని పరిశీలిస్తే, 1999లోనే మూతపడిన సఫ్దర్‌గంజ్‌ కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీని కొందరు అధికారులు పునరుద్ధరించి, ప్రభుత్వం నుంచి తక్కువ ధరకే భూమిని కాజేయడానికి ప్రయత్నించారని ప్రాసిక్యూషన్‌ ఆరోపించింది. ఈ స్కాంలో అప్పటి ఐఏఎస్‌ నరేందర్‌ కుమార్‌కు కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. నకిలీ పత్రాలు సృష్టించడంతోపాటు చనిపోయిన వారిని బతికున్నట్లుగా చూపించి అక్రమాలకు పాల్పడ్డారని విచారణలో తేలింది.

Updated Date - Nov 06 , 2025 | 04:10 AM