Decline in Birth Registrations: దేశంలో తగ్గుతున్న జననాలు
ABN , Publish Date - Oct 12 , 2025 | 04:06 AM
దేశంలో జననాల నమోదు సంఖ్య తగ్గుముఖం పట్టింది. 2023లో నమోదైన జననాల సంఖ్య 2022తో పోలిస్తే రెండు లక్షలకుపైగా తగ్గింది. ....
2023లో 2లక్షలకు పైగా తగ్గిన రిజిస్ట్రేషన్లు
న్యూఢిల్లీ, అక్టోబరు 11: దేశంలో జననాల నమోదు సంఖ్య తగ్గుముఖం పట్టింది. 2023లో నమోదైన జననాల సంఖ్య 2022తో పోలిస్తే రెండు లక్షలకుపైగా తగ్గింది. గత ఐదేళ్లలో ఇలా జననాల నమోదు తగ్గడం ఇది మూడోసారి. అదే సమయంలో మరణాల రిజిస్ట్రేషన్ స్వల్పంగా పెరిగింది. కేంద్ర హోం వ్యవహారాల శాఖ పరిధిలోని రిజిస్ట్రార్ ఆఫ్ ఇండియా (ఆర్‌జీఐ) విడుదల చేసిన సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్‌ఎస్) నివేదిక 2023లో ఈ వివరాలను వెల్లడించారు. ఆ నివేదిక ప్రకారం.. 2023లో దేశవ్యాప్తంగా 25.2 మిలియన్ (దాదాపు 2 కోట్ల 52 లక్షలు) జననాలు నమోదయ్యాయి. ఇది అంతకుముందు సంవత్సరం (2022) కంటే 0.9ు (2,32,094) తక్కువ. దేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గుముఖం పడుతున్నదనడానికి ఇది సంకేతమని భావిస్తున్నారు. మరోవైపు, కొవిడ్-19 మహమ్మారి ముగిసిన తర్వాత కూడా మరణాల సంఖ్య స్వల్పంగా పెరిగింది. 2023లో మొత్తం 8.7 మిలియన్ (దాదాపు 87 లక్షలు) మరణాలు రిజిస్టర్ కాగా, ఇది 2022లో కంటే 9,749 (0.1ు) ఎక్కువ. మరణాల సంఖ్య దాదాపు స్థిరంగా ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. ఆస్పత్రులు, ఆరోగ్యకేంద్రాల్లో జరిగే ప్రసవాల శాతం తగ్గింది. ఇది 2022లో 75.5ు ఉండగా, 2023లో 74.7ుకి పడిపోయింది. కొవిడ్‌కు ముందు ఇది 80 శాతం కంటే ఎక్కువగా ఉండేది. మరోవైపు, అత్యవసర సమయంలో సరైన వైద్య సహాయం అందక మరణించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. 2022లో 50.7ు ఉన్న మరణాల శాతం 2023లో ఏకంగా 53.4 శాతానికి పెరిగింది. కొవిడ్‌కు ముందు ఇది 40 శాతం లోపే ఉండేది.