Share News

IPS Officer Suicide: కుల వివక్షకు దళిత ఐపీఎస్‌ బలి

ABN , Publish Date - Oct 09 , 2025 | 02:39 AM

హరియాణా పోలీసు శాఖలో కుల వివక్ష తెలుగువాడైన ఓ సీనియర్‌ దళిత ఐపీఎస్‌ అధికారి ప్రాణాలు తీసింది. పలువురు సీనియర్‌ అధికారులు వెంటాడి మానసికంగా వేధించడంతో భరించలేక....

IPS Officer Suicide: కుల వివక్షకు దళిత ఐపీఎస్‌ బలి

  • తెలుగువాడైన హరియాణా ఏడీజీపీ పూరన్‌ కుమార్‌ ఆత్మహత్య

  • 8 పేజీల సూసైడ్‌ నోట్‌ రాసిన ఐపీఎస్‌

చండీగఢ్‌, అక్టోబరు 8: హరియాణా పోలీసు శాఖలో కుల వివక్ష తెలుగువాడైన ఓ సీనియర్‌ దళిత ఐపీఎస్‌ అధికారి ప్రాణాలు తీసింది. పలువురు సీనియర్‌ అధికారులు వెంటాడి మానసికంగా వేధించడంతో భరించలేక ఆ ఐపీఎస్‌ సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇది హరియాణా ఏడీజీపీ వై పూరన్‌ కుమార్‌ విషాదాంతం. మంగళవారం మధ్యాహ్నం చండీగఢ్‌ సెక్టార్‌ 11లోని తన బావమరిది నివాస భవనం సౌండ్‌ప్రూఫ్‌ బేస్‌మెంట్‌లో కుమార్‌ బలవన్మరణానికి పాల్పడ్డారు. రక్తపు మడుగులో ఉన్న కుమార్‌ మృతదేహాన్ని ఆయన కుమార్తె గుర్తించింది. పోలీసు శాఖలో కుల వివక్ష సహా పలు అక్రమాలకు వ్యతిరేకంగా గళమెత్తి పోరాడిన కుమార్‌... పలువురు సీనియర్‌ అధికారులు పగబట్టి వేధించడం... చివరకు ఓ లంచం కేసులో ఇరికించడంతో బలవన్మరణానికి పాల్పడ్డారు. వారు తనను మానసికంగా ఎలా వేధించిందీ కుమార్‌ 8 పేజీల సూసైడ్‌ నోట్‌లో రాశారు. తన కెరీర్‌ను నాశనం చేయడానికి కుట్ర పన్నారని పేర్కొన్నారు. ఆ అధికారులు ఎవరనేది చండీగఢ్‌ పోలీసులు ఇంకా వెల్లడించలేదు. వారిలో కొందరు రిటైరైన అధికారులు కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ వేధింపులకు తోడు తాజాగా ఓ మద్యం కాంట్రాక్టర్‌ ఫిర్యాదుతో నమోదైన లంచం కేసులో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా కుమార్‌ పేరును కూడా చేర్చారు. ప్రాధాన్యం లేని పోస్టుకు బదిలీ చేశారు. ఈ పరిణామాలతో కుమార్‌ కలత చెందినట్లు తెలుస్తోంది. కుమార్‌ పేరు చెప్పి అతని సహాయకుడైన సుశీల్‌ రూ.2.5 లక్షలు లంచం అడిగాడని ఆ మద్యం కాంట్రాక్టర్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దాంతో రోహతక్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో కుమార్‌ పేరును కూడా చేర్చారు. సొంత శాఖలో కుల వివక్ష, అక్రమాలు, అన్యాయాలను నిలదీసిన కుమార్‌ను టార్గెట్‌ చేసిన సీనియర్‌ అధికారులు అతన్ని ఇరికించడానికి ఇదే అదనుగా వారు భావించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కుమార్‌ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. 2001 బ్యాచ్‌ హరియాణా క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి. 2008లో ఓ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వేధింపులపై జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా దళిత అధికారులపై వివక్షపై ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారు. తాను ప్రభుత్వానికి సన్నిహితుడినని చెప్పుకున్న ఓ ఐపీఎస్‌ అధికారికి గత హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టింగు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కూడా ఈసీకి ఫిర్యాదు చేశారు. గతంలో ఐపీఎస్‌ అధికారుల పదోన్నతుల్లో అక్రమాలపై హరియాణా సీఎం నాయబ్‌ సింగ్‌ సైనీకి లేఖ రాశారు.ఉత్తమ సేవలకు రాష్ట్రపతి చేతుల మీదుగా పతకం అందుకున్నారు. పూరన్‌ భార్య అమనీత్‌ కుమార్‌ 2001 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి. ప్రస్తుతం జపాన్‌లో పర్యటిస్తున్న సీఎం సైనీ నేతృత్వంలోని అధికారుల బృందంలో ఆమె కూడా ఉన్నారు.

Updated Date - Oct 09 , 2025 | 02:39 AM