Share News

Maoists : మావోయిస్టుల కుట్ర భగ్నం.. 50 కిలోల ఐఈడీ నిర్వీర్యం

ABN , Publish Date - Jan 24 , 2025 | 05:04 AM

బీజాపూర్‌లోని ఓ రాష్ట్ర రహదారిపై భద్రతాబలగాలే టార్గెట్‌గా మావోయిస్టులు అమర్చిన భారీ ఐఈడీని సీఆర్పీఎఫ్‌ బాంబ్‌ స్క్వాడ్‌ నిర్వీర్యం చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. మావోయిస్టులు

Maoists : మావోయిస్టుల కుట్ర భగ్నం.. 50 కిలోల ఐఈడీ నిర్వీర్యం

కల్వర్ట్‌ కింద అమర్చిన నక్సల్స్‌

గుర్తించిన సీఆర్పీఎఫ్‌.. మరో బాంబుతో పేల్చివేత

సుకుమాలో భారీ డంప్‌ స్వాధీనం

చర్ల/చింతూరు, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): బీజాపూర్‌లోని ఓ రాష్ట్ర రహదారిపై భద్రతాబలగాలే టార్గెట్‌గా మావోయిస్టులు అమర్చిన భారీ ఐఈడీని సీఆర్పీఎఫ్‌ బాంబ్‌ స్క్వాడ్‌ నిర్వీర్యం చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. మావోయిస్టులు ఆవపల్లి-బసగూడ రాష్ట్ర రహదారిలో తిమ్మాపూర్‌ దుర్గ ఆలయం సమీపంలో ఓ కల్వర్టు కింద రిమోట్‌ కంట్రోల్‌తో పేల్చేలా 50 కిలోల ఐఈడీని అమర్చారు. సీఆర్పీఎఫ్‌ 168వ బెటాలియన్‌కు చెందిన బాంబ్‌స్క్వాడ్‌ బృందం గురువారం ఉదయం ఈ విషయాన్ని గుర్తించింది. కల్వర్ట్‌ కింద కాంక్రీట్‌ను తొలగించి, ఓ బొరియగా మార్చి, అందులోనే ఐఈడీని అమర్చడంతో తొలగింపు సాధ్యం కాలేదని అధికారులు తెలిపారు. దాంతో.. మరో బాంబును పెట్టి.. ఆ ఐఈడీని పేల్చేసినట్లు తెలిపారు. దీని వల్ల కల్వర్ట్‌ దెబ్బతిన్నదని, మరమ్మతులు జరుగుతున్నాయని చెప్పారు. కాగా.. సుకుమా జిల్లా మెట్టగూడ-దూలేడ్‌ గుట్టల్లో మావోయిస్టులకు చెందిన భారీ డంప్‌ ను బలగాలు గుర్తించాయి. గ్యాస్‌ సిలిండర్లు, బీజీఎల్స్‌ తయారీ పరికరాలు, మందుపాతరలు, ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు కోబ్రా, సీఆర్పీఎఫ్‌ బలగాలు వెల్లడించాయి.

Updated Date - Jan 24 , 2025 | 05:04 AM