Rivaba Jadeja: గుజరాత్ మంత్రివర్గంలోకి క్రికెటర్ జడేజా భార్య రివాబా
ABN , Publish Date - Oct 18 , 2025 | 03:43 AM
గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. మెగా క్యాబినెట్‌ను ఏర్పాటు చేశారు.
26 మందితో మెగా క్యాబినెట్ ఏర్పాటు
గాంధీనగర్, అక్టోబరు 17: గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. మెగా క్యాబినెట్‌ను ఏర్పాటు చేశారు. గత మంత్రివర్గంలో 17 మంది ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 26కు చేరింది. తాజా క్యాబినెట్‌లో 19 మంది కొత్త వారికి చోటు కల్పించారు. ఇందులో అనూహ్యంగా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబాకు కూడా అవకాశం దక్కింది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సీఎం భూపేంద్ర పటేల్ మినహా మిగిలిన 16 మంది మంత్రులూ గురువారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. గుజరాత్‌లో 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. కొద్ది నెలల్లోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించడం గమనార్హం. శుక్రవారం గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ నూతన మంత్రులతో ప్రమాణం చేయించారు. పాత వారిలో హోం శాఖ సహాయ మంత్రిగా చేసిన సంఘావికి డిప్యూటీ సీఎంగా పదోన్నతి కల్పించడం విశేషం. 2022లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో రివాబా జామ్‌నగర్ నార్త్ నుంచి గెలుపొందారు.