Credit Card Scam: క్రెడిట్ కార్డు ఆఫర్.. ఫోన్‌లోనే దరఖాస్తు.. 6 నెలల కల్లా జీవితం తారుమారు
ABN , Publish Date - Dec 28 , 2025 | 01:19 PM
క్రెడిట్ కార్డు ఆఫర్ నచ్చిన ఫోన్‌లోనే దరఖాస్తు చేసుకున్న ఓ వ్యక్తి ఊహించని పరిస్థితిని ఎదుర్కొన్నాడు. కార్డు చేతికందకపోయినా రూ.14 లక్షల బిల్లు కట్టాల్సి రావడంతో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించిన ఊరట పొందాడు.
ఇంటర్నెట్ డెస్క్: క్రెడిట్ కార్డు లేకపోయినా రూ.14 లక్షల బిల్లు రావడంతో ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. చివరకు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించడంతో ఊరట దక్కింది. బెంగళూరులో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది (Bengaluru Credit Card Fraud Case).
అవినాశ్ అనే వ్యక్తి ఓ ఫిన్‌టెక్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. 2023లో ఒకసారి అతడికి రిజ్వాన్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. తాను యాక్సిస్ బ్యాంకు ప్రతినిధిని అని చెప్పుకున్నాడు. ఓ క్రెడిట్ కార్డు ఆఫర్ ఉందని, వెంటనే క్లెయిమ్ చేసుకుంటే బోలెడన్ని ప్రయోజనాలు కలుగుతాయని చెప్పాడు. దీంతో, అవినాశ్ ఫోన్ ద్వారా కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆధార్, పాన్, శాలరీ స్లిప్స్ వంటి వాటిని సమర్పించాడు. ఆ తరువాత కొన్ని రోజులకు అవినాశ్ దరఖాస్తు తిరస్కరణకు గురైనట్టు సమాచారం అందింది. దీంతో, అవినాశ్ ఆ విషయాన్ని అక్కడితో మర్చిపోయాడు.
ఇది జరిగిన ఆరు నెలలకు అవినాశ్‌కు ఊహించని సమస్య ఎదురైంది. క్రెడిట్ కార్డు బాకీ రూ.14.2 లక్షలకు చేరిందంటూ బ్యాంకు ప్రతినిధులు సంప్రదించడంతో షాకవడం అతడి వంతైంది. ఈ క్రమంలో అవినాశ్ జరిగినదంతా చెప్పుకొచ్చాడు. తనకు ఏమీ తెలియదని స్పష్టం చేశారు. తనకు ఇంతవరకూ కార్డే అందలేని అన్నాడు. అతడి వాదనను తిరస్కరించిన బ్యాంకు ఏజెంట్ ఒత్తిడి పెంచడంతో చివరకు బాధితుడు పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఆ తరువాత బ్యాంకుకు కూడా ఈమెయిల్ చేశాడు. తగిన చర్యలు తీసుకుంటామని చెప్పిన బ్యాంకు ఆ తరువాత ఎలాంటి చర్యలు తీసుకోకపోగా లోన్ రికవరీ ఒత్తిడి పెరిగింది. దీంతో, బాధితుడు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు.
ఈ క్రమంలో వినియోగదారుల కమిషన్ నుంచి బ్యాంకుకు నోటీసులు అందినా స్పందించలేదు. దీంతో, వినియోగదారుడి ఫిర్యాదుపై బ్యాంకు తగిన చర్యలు తీసుకోలేదని కమిషన్ అభిప్రాయపడింది. ఈ లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పింది. లోన్ రికవరీని తక్షణం నిలిపివేయాలని ఆదేశించడంతో పాటు బాధితుడికి న్యాయఖర్చుల కింద రూ.2 వేలు చెల్లించాలని ఆదేశించింది.
ఇవీ చదవండి
ఎన్నికల్లో గ్యాంగ్‌స్టర్ నామినేషన్! చేతులను తాళ్లతో కట్టేసి తీసుకొచ్చిన పోలీసులు
గుడ్ న్యూస్.. రైల్వే శాఖ సమగ్ర ప్రణాళిక.. 2030 కల్లా..