Share News

CPM: మోదీ ప్రభుత్వం ఫాసిస్టు కాదు!

ABN , Publish Date - Feb 26 , 2025 | 04:39 AM

తన వైఖరి మార్చుకుందా? దానిపై ఫాసిస్టు ముద్ర వేసేందుకు నిరాకరిస్తోందా? ..అవునని తాజా పరిణామమే చెబుతోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మోదీ సర్కారుకు నయా-ఫాసిస్టు పోకడలు ఉన్నాయని పార్టీ ముసాయిదా తీర్మానంలో అంగీకరిస్తూనే.. ఫాసిస్టు ప్రభుత్వమని మాత్రం అనకుండా సీపీఎం ఆగిపోయింది.

CPM: మోదీ ప్రభుత్వం ఫాసిస్టు కాదు!

నయా-ఫాసిజం పోకడలు మాత్రమే ఉన్నాయి

ముసాయిదా రాజకీయ తీర్మానంలో సీపీఎం

దశాబ్దాల వైఖరి మార్చుకున్న మార్క్సిస్ట్‌ పార్టీ?

డాక్యుమెంటు సవరించాలని సీపీఐ డిమాండ్‌

బీజేపీ-ఎల్‌డీఎఫ్‌ రహస్య పొత్తు: కాంగ్రెస్‌

ఆలస్యంగానైనా సీపీఎం గ్రహించింది: బీజేపీ

తిరువనంతపురం, ఫిబ్రవరి 25: కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని తీవ్ర నిరంకుశత్వ జాతీయవాద (ఫాసిస్టు) శక్తిగా పేర్కొంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడే సీపీఎం.. తన వైఖరి మార్చుకుందా? దానిపై ఫాసిస్టు ముద్ర వేసేందుకు నిరాకరిస్తోందా? ..అవునని తాజా పరిణామమే చెబుతోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మోదీ సర్కారుకు నయా-ఫాసిస్టు పోకడలు ఉన్నాయని పార్టీ ముసాయిదా తీర్మానంలో అంగీకరిస్తూనే.. ఫాసిస్టు ప్రభుత్వమని మాత్రం అనకుండా సీపీఎం ఆగిపోయింది. దీనిపై సోదర కమ్యూనిస్టు పక్షం సీపీఐ ఆగ్రహం వ్యక్తంచేయగా.. మార్క్సిస్ట్‌ పార్టీ ఏళ్లతరబడి బీజేపీతో సాగిస్తున్న రహస్య మైత్రి బట్టబయలైందని కాంగ్రెస్‌ ధ్వజమెత్తింది. తమిళనాడులోని మదురైలో వచ్చే ఏప్రిల్లో సీపీఎం జాతీయ కాంగ్రెస్‌ జరుగనుంది. అందులో ఆమోదించే విశ్లేషణాత్మక రాజకీయ తీర్మానం ముసాయిదాను కేంద్ర కమిటీ ఇటీవల రాష్ట్ర కమిటీలకు చర్చ కోసం పంపింది. మోదీ సర్కారును సీపీఐ ఫాసిస్టు ప్రభుత్వంగా అభివర్ణిస్తుంటుంది.. భారత్‌లోకి ఫాసిజం వచ్చేసిందని సీపీఐ-ఎంఎల్‌ అటుంటుంది. ఈ రెండు పార్టీలకు తన వైఖరి భిన్నమని సీపీఎం సదరు ముసాయిదాలో పేర్కొంది.


ముస్సోలినీ, హిట్లర్‌ల నాటి ఫాసిజాన్ని క్లాసికల్‌ ఫాసిజంగా అభివర్ణించింది. తర్వాత వచ్చిన అలాంటి వ్యక్తీకరణలన్నీ ‘నియో-ఫాసిజం’ కిందకు వస్తాయని తెలిపింది. ‘సామ్రాజ్యవాద అంతర్గత వైరుధ్యాల వల్ల క్లాసికల్‌ ఫాసిజం పుట్టింది. నయా ఉదారవాద సంక్షోభం కారణంగా నయా-ఫాసిజం ఆవిర్భవించింది’ అని కొత్తగా నిర్వచించింది. గతంలో ఆర్‌ఎ్‌సఎస్‌ను ఫాసిస్టు లక్షణాలున్న సంస్థగా సీపీఎం పేర్కొంది. తాజాగా మోదీ ప్రభుత్వాన్ని ఫాసిస్టు కేటగిరీలో చేర్చలేమని.. అలాగే భారతదేశాన్ని నయా ఫాసిస్టుగా చిత్రీకరించరాదని తీర్మానంలో అభిప్రాయపడింది. ‘దశాబ్దానికిపైగా మోదీ అప్రతిహత పాలన కారణంగా రాజకీయాధికారం బీజేపీ-ఆర్‌ఎ్‌సఎస్‌ చేతుల్లో నిక్షిప్తమైపోయింది. ఈ కూటమిని అడ్డుకోకపోతే.. హిందూత్వ-కార్పొరేట్‌ నియంతృత్వం నయా ఫాసిజం వైపు నడుస్తుంది. అయితే నయా-ఫాసిజం పోకడలు అనే పదబంధాన్ని.. ప్రభుత్వం నయా-ఫాసిజం సర్కారుగా లేదా రాజకీయ వ్యవస్థగా రూపాంతరం చెందినట్లుగా అర్థం చేసుకోకూడద’ని తెలిపింది. సీపీఎంలో ఈ పరివర్తన సీపీఐకి ఆగ్రహం తెప్పించింది. తీర్మానాన్ని సవరించుకోవాలని సీపీఐ కేరళ రాష్ట్ర కార్యదర్శి వినయ్‌ విశ్వం అన్నారు. ఇంకోవైపు.. సీపీఎం ఆలస్యంగానైనా నిజాన్ని గ్రహించిందని, ఈ మార్పును స్వాగతిస్తున్నామని బీజేపీ పేర్కొంది.



మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: డీఎస్సీ‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Also Read : మాజీ ఎంపీకి జీవిత ఖైదు

Also Read: రైతుల కోసం ఈ పథకాలు.. వీటి వల్ల ఎన్నో లాభాలు.. ఇదే అర్హత.. ఇలా అప్లై చేసుకోండి చాలు

Also Read : అసోం బిజినెస్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Also Read: రిమాండ్ మళ్లీ పొడిగింపు.. విచారణలో నోరు విప్పని వంశీ

For National News And Telugu News

Updated Date - Feb 26 , 2025 | 04:39 AM