Share News

Delhi Blast: 10 రోజుల ఎన్ఐఏ కస్టడీకి ఢిల్లీ పేలుడు ఘటన నిందితుడు

ABN , Publish Date - Nov 17 , 2025 | 05:21 PM

అమీర్ రషీద్ అలీని కోర్టుకు హాజరుపరిచే సమయంలో మీడియాను అనుమతించలేదు. కోర్టు కాంప్లెక్స్ చుట్టూ ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది మోహరించారు. అల్లర్ల వ్యతిరేక టీమ్‌నూ సిద్ధం చేశారు.

Delhi Blast: 10 రోజుల ఎన్ఐఏ కస్టడీకి ఢిల్లీ పేలుడు ఘటన నిందితుడు
Delhi Blast Case

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఇటీవల జరిగిన భారీ పేలుడు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పేలుడుకు పాల్పడిన ఉమర్‌కు సహకరించిన నిందితుడు అమీర్ రషీద్ అలీ (Umar Nabi Ali)ని కట్టుదిట్టమైన భద్రత మధ్య పాటియాలా హౌస్ కోర్టు కాంప్లెక్స్‌లోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ కోర్టు ముందు సోమవారం నాడు హాజరుపరిచారు. ఈ మేరకు 10 రోజుల ఎన్ఐఏ కస్టడీకి కోర్టు ఆదేశించింది. ఆ వెంటనే రషీద్‌ను ఎన్‌ఐ‌ఏ కార్యాలయానికి అధికారులు తరలించారు.


అమీర్ రషీద్ అలీని కోర్టుకు హాజరుపరిచే సమయంలో మీడియాను అనుమతించలేదు. కోర్టు కాంప్లెక్స్ చుట్టూ ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది మోహరించారు. అల్లర్ల వ్యతిరేక టీమ్‌నూ సిద్ధం చేశారు. నవంబర్ 10న జరిగిన ఢిల్లీ పేలుడు ఘటనలో 10 మంది మృతిచెందగా, 13మంది గాయపడ్డారు. ఐఈడీ అమర్చి పేల్చిన ఐ20 కారు అమీర్ పేరుతో రిజిస్టర్ కావడంతో ఎన్ఐఏ అతన్ని అదుపులోకి తీసుకుంది. సూసైడ్ బాంబర్ ఉమర్ నబీతో కలిసి ఈ దాడికి అమీర్ రషీద్ కుట్రపన్నినట్టు ఎన్ఐఏ వెల్లడించింది. అమీర్ జమ్మూకశ్మీర్‌లోని పంపోర్‌కు చెందిన వ్యక్తి కాగా, ఉమర్ ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. తదుపరి విచారణలో భాగంగా ఉమర్ ఉపయోగించిన మరో కారునూ ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. ఇంతవరకూ గాయపడిన బాధితులతో సహా 73మంది సాక్ష్యులను ఎన్ఐఏ విచారించింది.


మరోవైపు, ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ కేసులో ప్రమేయం, మోసం, ఫోర్జరీకి పాల్పడిన ఆరోపణలపై అల్-ఫలాహ్ యూనివర్శిటీ చైర్మన్‌కు ఢిల్లీ పోలీసులు రెండు సమన్లు జారీ చేశారు. యూజీసీ, ఎన్ఏఏసీ లేవనెత్తిన ఆందోళనలపై రెండు ఎఫ్ఐఆర్‌లనూ నమోదు చేశారు. యూనివర్శిటీ గుర్తింపు క్లెయిమ్స్‌పై జరిపిన సమీక్షలో పెద్దఎత్తున అవకతవకలు జరిగినట్టూ గుర్తించారు.


ఇవి కూడా చదవండి..

88 గంటల ఆపరేషన్ సిందూర్ జస్ట్ ట్రైలర్... ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది

ఢిల్లీలో కారు పేలుడుకు ‘మదర్‌ ఆఫ్‌ సైతాన్‌’?

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Nov 17 , 2025 | 05:41 PM