Religious Controversy: అబద్ధాల ‘నిజలింగ’
ABN , Publish Date - Aug 08 , 2025 | 05:35 AM
కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట మఠాధిపతిగా వ్యవహరించిన నిజలింగస్వామి అలియాస్ మహమ్మద్ నిసార్ గురించి కలకలం రేపే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
వెలుగులోకి నిజలింగస్వామీజీ మోసాలు
బసవదీక్ష స్వీకరించినా ఇస్లాంపై మమకారం
బెంగళూరు, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట మఠాధిపతిగా వ్యవహరించిన నిజలింగస్వామి అలియాస్ మహమ్మద్ నిసార్ గురించి కలకలం రేపే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. గుండ్లుపేట తాలూకా చౌడహళ్లి గ్రామంలోని గురుమల్లేశ్వర విరక్తమఠం మఠాధిపతిగా నిజలింగస్వామీజీ వ్యవహరించారు. ఆయన ముస్లిం మతస్థుడని తెలియడంతో గ్రామస్థులు మఠం నుంచి బహిష్కరించారు. యాదగిరి జిల్లా శహపుర తాలూకాకు చెందిన ఆయన పూర్వనామం మహమ్మద్ నిసార్. బాల్యంలోనే సన్యాసం స్వీకరించారు. బసవణ్ణ వచనాలు, మానవతా బోధనలు చేసేశారు. 2020లో బసవదీక్ష స్వీకరించారు. బసవకల్యాణలో బసవ మహాముని బసవ ప్రభుస్వామీజీ నుంచి లింగదీక్ష పొందారు. 2020 ఆగస్టు 15న బసవలింగస్వామీజీగా మారారు.
గుండ్లుపేట మఠం శాఖకు ఆయనను మఠాధిపతిగా నియమించారు. ఆయన ఎస్‌ఎ్‌సఎల్‌సీ మార్కుల జాబితా ఇటీవల వెలుగులోకి రాగా, అందులో మహమ్మద్ నిసార్ అని పేరు ఉండటం కలకలం రేపింది. అతడి మూలం ఇస్లాం మతం కావడంతో భక్తుల నుంచి వ్యతిరేకత వచ్చింది. భక్తులు రెండు వర్గాలుగా విడిపోయారు. దీంతో ఆయన సోమవారం పీఠాన్ని వదిలి వెళ్లిపోయారు. కాగా, మఠాఽధిపతిగా ఉంటూనే ఆయన ముస్లింలు ధరించే టోపీలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినట్లు గ్రామస్థులు గుర్తించారు. స్వామీజీగా ఉంటూనే మద్యం సేవించేవారని, మాంసాహారాన్ని భుజించేవారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.