Share News

Supreme Court: పార్టీ తరఫునా..

ABN , Publish Date - Oct 13 , 2025 | 03:59 AM

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌కు సంబంధించిన జీవో 9పై తెలంగాణ హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు పార్టీ పరంగా కాంగ్రెస్‌ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది......

Supreme Court: పార్టీ తరఫునా..

  • బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు కాంగ్రెస్‌

  • స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలుకు యోచన

  • జీవో 9పై హైకోర్టు స్టే విధించడం మీద ప్రభుత్వపరంగా నేడు పిటిషన్‌

  • నేడు ఢిల్లీకి టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌

  • అభిషేక్‌ సింఘ్వీతో భేటీ అయ్యే అవకాశం

  • ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేకు పరామర్శ

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌కు సంబంధించిన జీవో 9పై తెలంగాణ హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు పార్టీ పరంగా కాంగ్రెస్‌ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో టీపీసీసీ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఇటీవల అస్వస్థతకు గురైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను పరామర్శించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ సోమవారం ఢిల్లీ వెళుతున్నారు. ఖర్గేను పరామర్శించిన అనంతరం.. పార్టీ పరంగా పిటిషన్‌ దాఖలు చేసే అంశంపై చర్చించేందుకు ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ మనుసింఘ్వీని మహేశ్‌కుమార్‌గౌడ్‌ కలవనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం పిటిషన్‌ దాఖలు చేయనుంది. ఇందుకోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే సింఘ్వీ సహా ఇతర న్యాయవాదులతో చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు 42శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నామని, దీనికి సంబంధించి అన్ని మార్గాలనూ అన్వేషించాలని కోరారు. రాష్ట్రంలో కులగణన సర్వే నిర్వహించిన తర్వాతే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేశామని, దీనికోసం ప్రత్యేకంగా ఒక కమిషన్‌ ఏర్పాటు చేయడం, ఆ కమిషన్‌ అధ్యయనం, సూచనలు, సలహాలతోనే రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించిన విషయాన్ని సుప్రీంకోర్టుకు విన్నవించాలని కోరినట్లు సమాచారం. ఈ మేరకు అన్ని అంశాలనూ పొందు పరుస్తూ సోమవారం పిటిషన్‌ దాఖలు చేయనున్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.

Updated Date - Oct 13 , 2025 | 04:56 AM