Share News

Congress Accused he BJP: మోదీ సర్కార్‌కుచట్టబద్ధత లేదు

ABN , Publish Date - Sep 25 , 2025 | 04:10 AM

ఎన్నికల్లో బీజేపీయే గెలిచేలా వ్యవస్థీకృతంగా జరుగుతున్న ఓట్ల చోరీ కుట్ర బయటపడిందని.. అలా ఏర్పడిన ఈ ప్రభుత్వానికి ఎలాంటి నైతిక, రాజకీయ చట్టబద్ధత లేదని కాంగ్రెస్‌ పేర్కొంది. ఓట్ల చోరీ వ్యవహారంతో...

Congress Accused he BJP: మోదీ సర్కార్‌కుచట్టబద్ధత లేదు

ఓట్ల చోరీతో గెలిచిన ఈ ప్రభుత్వానికి.. నైతికంగా, రాజకీయంగా ఏ విలువా లేదు

  • ఎక్కడ చూసినా ‘ఓట్‌ చోర్‌.. గద్దీ చోడ్‌’

  • కాంగ్రెస్‌ పోరాటంలో అంతా కలిసిరావాలి

  • బెడిసికొట్టిన మోదీ ‘కౌగిలింతల దౌత్యం’

  • మిత్రదేశమంటూనే సుంకాలు వేసిన ట్రంప్‌

  • అమెరికా జబ్బు కంటే చైనా మందు ప్రమాదం

  • బిహార్‌లో సీడబ్ల్యూసీ భేటీలో తీర్మానం

  • ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తరహాలో అత్యంత వెనుకబడ్డ బీసీలకు చట్టం: రాహుల్‌

పట్నా, సెప్టెంబరు 24: ఎన్నికల్లో బీజేపీయే గెలిచేలా వ్యవస్థీకృతంగా జరుగుతున్న ఓట్ల చోరీ కుట్ర బయటపడిందని.. అలా ఏర్పడిన ఈ ప్రభుత్వానికి ఎలాంటి నైతిక, రాజకీయ చట్టబద్ధత లేదని కాంగ్రెస్‌ పేర్కొంది. ఓట్ల చోరీ వ్యవహారంతో ప్రజాస్వామ్యంపై ప్రజల్లో ఉన్న నమ్మకం సడలిపోతోందని వ్యాఖ్యానించింది. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌) మన ప్రజాస్వామ్యానికి ముప్పు అని.. ఓటర్ల జాబితాల్లో అక్రమాల కోసం బీజేపీ చేస్తున్న మోసమని అభివర్ణించింది. దేశ ప్రజలు దీనంతటినీ గమనించాలని.. ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ చేస్తున్న పోరాటంలో కలిసి రావాలని పిలుపునిచ్చింది. ‘ఓట్‌ చోర్‌.. గద్దీ చోడ్‌ (ఓట్ల దొంగ.. గద్దె దిగు)’ నినాదం ఇప్పుడు బిహార్‌లో ఇంటింటా వినిపిస్తోందని, రేపు దేశవ్యాప్తంగా మారుమోగుతుందని పేర్కొంది. ఈ మేరకు బిహార్‌లోని పాట్నాలో జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో రెండు తీర్మానాలు చేసింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో అగ్రనేత రాహుల్‌ గాంధీ, సీనియర్లు అజయ్‌ మాకెన్‌, కేసీ వేణుగోపాల్‌, జైరామ్‌ రమేశ్‌, సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి దామోదర, పీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే సీడబ్ల్యూసీ సమావేశాలను దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బిహార్‌లో నిర్వహించడం ఇదే మొదటిసారి.


రాహుల్‌కు సెల్యూట్‌ చేస్తున్నాం..

ఓటు చోరీ వ్యవహారంతో దేశ ప్రజల్లో ప్రజాస్వామ్యంపై నమ్మకం సడలిపోతోందని సీడబ్ల్యూసీ తీర్మానంలో పేర్కొంది. ‘‘బీజేపీ గెలిచేలా వ్యవస్థీకృతంగా, క్రమపద్ధతిలో జరుగుతున్న కుట్ర బయటపడింది. ఇలా ఓట్ల చోరీతో ఏర్పడిన ఈ ప్రభుత్వానికి ఎలాంటి నైతిక, రాజకీయ చట్టబద్ధత లేదు. నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు, ధరల పెరుగుదల, విద్య, వైద్య వ్యవస్థల విధ్వంసం వంటివేవీ బీజేపీకి పట్టవు. ఎందుకంటే తాము ప్రజలకు సేవ చేసి ఓట్లు పొందాల్సిన అవసరం లేదని, ఓట్ల చోరీతో గెలిచేయవచ్చని వారికి తెలుసు. అలాంటి ఓటు చోరీపై ధైర్యంగా పోరాడుతూ, అవకతవకలను బయటపెడుతున్న రాహుల్‌ గాంధీకి సెల్యూట్‌ చేస్తున్నాం’’ అని తెలిపింది. ఇప్పుడు ఓటు చోరీ చేస్తున్నవారు భవిష్యత్తులో ప్రజల గౌరవాన్ని, రాజ్యాంగం కల్పించిన హక్కులనూ చోరీ చేస్తారని విమర్శించింది. సమావేశం అనంతరం జైరామ్‌ రమేశ్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘వచ్చే నెలలో రాహుల్‌ గాంధీ ఓటుచోరీపై మరిన్ని కీలక అంశాలను బయటపెడతారు. ఎన్డీయే ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి. తెలంగాణలో సీడబ్యూసీ భేటీ నిర్వహించిన ఐదు నెలల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు రెండు నెలల్లో బిహార్‌లో మహాఘట్‌బంధన్‌ కూటమి అధికారంలోకి రావడం ఖాయం’’ అని పేర్కొన్నారు.

మోదీ ‘కౌగిలింతల దౌత్యం’ బెడిసికొట్టింది

గత పదేళ్లలో భారత విదేశాంగ విధానం కుప్పకూలిపోయిందని.. మోదీ ‘కౌగిలింత దౌత్యం’ బెడిసికొట్టిందని కాంగ్రెస్‌ విమర్శించింది. దౌత్యపరంగా మన దేశం ఒంటరిదైపోయిందని, జాతీయ ప్రయోజనాలను కాపాడుకోలేని దుస్థితిలో పడిందని తీర్మానంలో ఆరోపించింది. ‘‘ఎన్డీయే ప్రభుత్వం అటు అమెరికా, ఇటు చైనాల మధ్య ఊగిసలాడుతూ తెలివితక్కువగా వ్యవహరించింది. మిత్రదేశం అంటూనే భారత్‌పై ట్రంప్‌ భారీగా టారి్‌ఫలు విధించారు. హెచ్‌1బీ వీసాల విధానాన్ని కఠినతరం చేశారు. దీనికి ప్రతిగా మోదీ ప్రభుత్వం చైనా వైపు మళ్లింది. ఇది మరింత ప్రమాదకరం. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్థాన్‌కు చైనా ఆయుధాలు అందించింది’’ అని పేర్కొంది. అమెరికా జబ్బు కంటే..చైనా పేరిట వేస్తున్న మందు మరింత ప్రమాదకరమని అభివర్ణించింది.


మోదీ ప్రభుత్వ పతనానికి నాంది: ఖర్గే

బిహార్‌లో జరగనున్న ఎన్నికలు భవిష్యత్తులో కేంద్రంలో మోదీ అవినీతి ప్రభుత్వ పతనానికి నాంది పలకనున్నాయని ఖర్గే పేర్కొన్నారు. ఓట్ల చోరీ, ఆర్థిక వ్యవస్థ మందగమనం, నిరుద్యోగం, సామాజిక విభజన, స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థలను బలహీనం చేయడం వంటివాటితో దేశం అల్లకల్లోలం అవుతోందని ఆరోపించారు. అయితే, బిహార్‌లో మిత్రపక్షాలపై పెత్తనం చేసేందుకే పాట్నాలో సీడబ్ల్యూసీ భేటీ నిర్వహించారని కేంద్ర మంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌, బీజేపీ ఎంపీ రవిశంకర్‌ ప్రసాద్‌ ఆరోపించారు. దీనిని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పవన్‌ ఖేరా ఖండించారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తరహాలో ఈబీసీలకు చట్టం: రాహుల్‌

బీసీల్లో మరింత వెనుకబడిన కులాల (ఈబీసీ) వారి కోసం.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్‌ చట్టం తరహాలో ప్రత్యేక చట్టం తెస్తామని రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. బిహార్‌లోని పాట్నాలో సీడబ్ల్యూసీ భేటీ అనంతరం ‘ఈబీసీలకు న్యాయ సంకల్పం’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్‌ మాట్లాడారు. బిహార్‌ జనాభాలో ఎక్కువశాతం ఉన్న ఈబీసీల కోసం 10 ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. ఈబీసీ అట్రాసిటీస్‌ చట్టం తెస్తామని, స్థానిక ఎన్నికల్లో వారి రిజర్వేషన్లను 30శాతానికి పెంచుతామని, ప్రభుత్వ కాంట్రాక్టుల్లోనూ రిజర్వేషన్‌ ఇస్తామని హామీ ఇచ్చారు.

Updated Date - Sep 25 , 2025 | 04:11 AM