Tamil Nadu CM Stalin: పథకాలు, చట్టాలకు హిందీ, సంస్కృత పేర్లా
ABN , Publish Date - Oct 19 , 2025 | 03:14 AM
ఇనుపయుగం తమిళనాడు నుంచే ప్రారంభమైందన్న చారిత్రక వాస్తవాన్ని అంగీకరించేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర.....
కేంద్రంపై సీఎం స్టాలిన్ ధ్వజం
చెన్నై, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): ఇనుపయుగం తమిళనాడు నుంచే ప్రారంభమైందన్న చారిత్రక వాస్తవాన్ని అంగీకరించేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వెనుకాడుతోందని, కీళడి పురావస్తు తవ్వకాలకు సంబంధించిన నివేదికను ఆమోదించకుండా పల్టీలు కొడుతోందని డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం స్టాలిన్ ధ్వజమెత్తారు. ఆ మేరకు ఆయన తన ఎక్స్ పేజీలో కొన్ని ప్రశ్నలను సంధించారు. ‘‘బీజేపీ కూటమిలో చేరిన నేరస్థులు, అవినీతిపరులు ఎలా పవిత్రులుగా మారిపోతారో వివరించగలరా? దేశంలోని కీలకమైన పథకాలకు, చట్టాలకు హిందీ, సంస్కృతంలోనే పేర్లు పెట్టడం దురహంకారానికి నిదర్శనం కాదా? ప్రతిపక్ష పార్టీలు పాలించే రాష్ట్రాల్లో గవర్నర్ల ద్వారా కుటిల రాజకీయాలు జరిపి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలలో గందరగోళం సృష్టించడం న్యాయమా? తమిళనాడు నుంచే ఇనుపయుగం ప్రారంభమైందనే వాస్తవాన్ని ఎందుకు అంగీకరించడం లేదు’’ అని ప్రశ్నించారు.