Share News

Government Clerk: జీతం 15 వేలు.. ఆస్తి వంద కోట్లు

ABN , Publish Date - Aug 02 , 2025 | 05:25 AM

కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేసే ఆయన జీతం నెలకు రూ.15 వేలు. కానీ ఆయన మొత్తం ఆస్తి విలువ దాదాపు రూ.100 కోట్లు

Government Clerk: జీతం 15 వేలు.. ఆస్తి వంద కోట్లు

  • కర్ణాటకలో ఓ కాంట్రాక్టు ఉద్యోగి భారీ అవినీతి

  • లెక్కల్లో చూపని అనేక ఆస్తులులోకాయుక్త దాడులతో వెలుగులోకి

  • 24 ఇళ్లు, 40 ఎకరాల భూమి, 5 ఇంటి స్థలాలు, కార్లు, బంగారం గుర్తింపు

బెంగళూరు, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేసే ఆయన జీతం నెలకు రూ.15 వేలు. కానీ ఆయన మొత్తం ఆస్తి విలువ దాదాపు రూ.100 కోట్లు. జీతం, ఆస్తికి సంబంధించిన ఈ రెండు అంకెలను పోల్చి చూస్తే ఎవరికైనా దిమ్మతిరిగి పోవాల్సిందే!! ఒక క్లర్క్‌గా పనిచేసే ఆయన.. కీలక అధికారులను తనకు అనుకూలంగా మలచుకొని, వారితో కలిసి భారీగా అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. లోకాయుక్త తాజా దాడుల్లో ఈ వ్యవహారం బయటపడింది. ఏకంగా లెక్కల్లో చూపని రూ.30 కోట్లకు పైగా ఆస్తులను అధికారులు గుర్తించారు. వీటిల్లో 24 ఇండ్లు, ఐదు ప్లాట్‌లు, 40 ఎకరాల వ్యవసాయ భూములు, కార్లు, బంగారం తదితరాలు ఉన్నాయి. వివరాళ్లోకి వెళ్తే.. కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(కేఆర్‌ఐడీఎల్‌)లో కళకప్ప నిడగుంది అనే వ్యక్తి కాంట్రాక్టు పద్ధతిన 2003లో చెత్త ఊడ్చే పనిలో చేరాడు. అప్పట్లో అతని నెల జీతం రూ.200 మాత్రమే. 17 ఏళ్ల సర్వీసు తర్వాత ఉద్యోగోన్నతిపై క్లర్క్‌ స్థాయికి చేరాడు. ఈ క్రమంలో కేఆర్‌ఐడీఎల్‌లో పనిచేసే కొందరు అధికారులతో కలిసి భారీగా అక్రమాలకు పాల్పడ్డాడు. 2023-24 మధ్య చేపట్టిన పనుల్లో రూ.72 కోట్ల దాకా అక్రమాలు జరిగాయని, 96 అసంపూర్తి ప్రాజెక్టులకు నకిలీ పత్రాలు సృష్టించి.. ఈ సొమ్మును కాజేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందులో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ చించోళ్కర్‌, కళకప్ప పాత్ర ఉన్నట్లు తేలింది. దీంతో 2024లో వీరిద్దరినీ సస్పెండ్‌ చేశారు. అప్పటికి కళకప్ప నెల జీతం రూ.15 వేలు. ఇతని అక్రమాల గురించి లోకాయుక్త బృందం సమగ్ర ఆధారాలు సేకరించింది.


పేదరికం నుంచి రూ.కోట్లకు పడగలెత్తాడు!

డీఎస్పీ వసంతకుమార్‌ నేతృత్వంలో కొప్పళ జిల్లా కేంద్రంలోని కళకప్ప నివాసం, గతంలో పనిచేసిన కార్యాలయంలో గురువారం ఏకకాలంలో దాడులు చేసింది. కళకప్పకు కొప్పళ, భాగ్యనగరలో 24 ఇళ్లులు ఉన్నట్లు గుర్తించింది. హిట్నాళ్‌, హుళగి, యలబురగలో 40 ఎకరాల భూమి, 5 ఇంటి స్థలాలను గుర్తించింది. వీటితో పాటు రెండు కార్లు, రెండు బైకులు, 350 గ్రాముల బంగారం, కేజీన్నరకు పైగా వెండి వస్తువులను కూడా అధికారులు సీజ్‌ చేశారు. ఈ ఆస్తులు కళకప్ప, ఆయన భార్య, సోదరుడి పేర్లపై ఉన్నాయి. పలువురి బినామీల పేరిట కూడా ఆస్తులు బయటపడ్డాయి. కాగా, సస్పెండ్‌ అయిన చించోళ్కర్‌ కోర్టు నుంచి స్టే తెచ్చుకుని దావణగెరెలో మళ్లీ విధులకు చేరారు. కళకప్పపై సస్పెన్షన్‌ కొనసాగుతోంది. కాగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో లోకాయుక్త అధికారులు గత కొద్ది రోజులుగా పలువురు ప్రభుత్వ అధికారులకు చెందిన ఇళ్లు, ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. జూలై 23నఐఏఎస్‌ అధికారి వసంతి అమర్‌తో సహా 8మంది అధికారులకు సంబంధించిన ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. రూ.37.42 కోట్ల విలువైన ఆస్తులను సీజ్‌ చేశారు.


ఇవి కూడా చదవండి

అనిల్ అంబానీకి షాక్.. లుక్ అవుట్ నోటీస్ జారీ చేసిన ఈడీ

తప్పతాగి డ్యూటీకి.. అడ్డంగా జనానికి దొరికిపోయిన ఎస్ఐ

Updated Date - Aug 02 , 2025 | 05:25 AM