Share News

Supreme Court: కేంద్రంపై మళ్లీ సీజేఐ ఆగ్రహం

ABN , Publish Date - Nov 07 , 2025 | 05:51 AM

ట్రైబ్యునళ్ల సంస్కరణల చట్టం-2021 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను వాయుదా వేయాలన్న

Supreme Court: కేంద్రంపై మళ్లీ సీజేఐ ఆగ్రహం

  • నేటి విచారణ వాయిదా వేయండి

  • ఏజీ తరఫున ఏఎస్‌జీ అభ్యర్థన

  • కుదరదన్న సీజేఐ జస్టిస్‌ గవాయ్‌

  • ‘ట్రైబ్యునళ్ల సంస్కరణల’ కేసులో తుది వాదనలు వింటాం

  • సోమవారం ఏజీ రాకపోతే కేసును ముగిస్తామని వెల్లడి

న్యూఢిల్లీ, నవంబరు 6: ట్రైబ్యునళ్ల సంస్కరణల చట్టం-2021 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను వాయుదా వేయాలన్న కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది అసమంజసమని, ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ఒకవేళ ఈ నెల 24 తర్వాత కేసు విచారణ కోరుకుంటున్నారా? అని నిలదీసింది. ఈ నెల 3న జరిగిన విచారణ సందర్భంగా కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ తీవ్ర వ్యాఖ్య లు చేసిన సంగతి తెలిసిందే. కేసు తుది వాదనలు వినడానికి సిద్ధమైన తర్వాత అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి.. ఈ పిటిషన్లపై ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం విచారణ జరపాలని కోరారు. దీనిపై సీజేఐ అభ్యంతరం వ్యక్తం చేశారు. పిటిషనర్‌ వాదనలు విన్న తర్వాత విస్తృత ధర్మాసనం విచారణ జరపాలని కోరడమంటే ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనాన్ని తప్పించుకొనే ఎత్తుగడేనని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని తాము ఊహించలేదన్నారు. ఈ కేసులో కేంద్ర ప్రభు త్వం వాదనలు విని, విచారణను ముగిస్తామని, ఆ తర్వాతే విస్తృత ధర్మాసనానికి ఇవ్వాలా?వద్దా? అన్న నిర్ణయం తీసుకుంటామని స్పష్టంచేస్తూ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. అయితే, అటార్నీ జనరల్‌(ఏజీ)కు శుక్రవారం అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేసుల విచారణ ఉందని.. ట్రైబ్యునళ్ల కేసు విచారణను వాయిదా వేయాలని గురువారం అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటి సీజేఐ ధర్మాసనాన్ని కోరారు. ఇది అసమంజసమని జస్టిస్‌ గవాయ్‌ అన్నారు. ‘‘ఆయనకు ఇప్పటికే మేం చాలా సమయం ఇచ్చాం. రెండుసార్లు వాదనలు వినిపించేందుకు అవకాశం ఇచ్చాం.


ఒకవేళ ఈ అంశం ఈ నెల 24 తర్వాత విచారణకు రావాలని మీరు కోరుకుంటున్నారా? అలాంటి ఉద్దేశం ఉంటే నిజాయితీగా చెప్పండి’’ అని ఈ నెల 23న పదవీ విరమణ చేయనున్న సీజేఐ పేర్కొన్నారు. ఈ కేసు విచారణను సోమవారం చేపట్టాలని ఐశ్వర్య కోరగా.. సీజేఐ చిరాకుపడ్డారు. ‘‘అలాగైతే మేం తీర్పు ఎప్పుడు రాయాలి? ఆయన మధ్యవర్తిత్వంతో బిజీగా ఉన్నారని ప్రతిరోజూ మాకు చెబుతారు. చివరి దశలో వచ్చి విస్తృత ధర్మాసనానికి కేసును బదిలీ చేయమని కోరతారు’’అని వ్యాఖ్యానించారు. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం తరఫున మరో న్యాయనిపుణుడు ఎందుకు హాజరవకూడదని ప్రశ్నించారు. శుక్రవారం తుది వాదనలు వింటామని స్పష్టం చేశారు. అలాగే అటార్నీ జనరల్‌కు సోమవారం వాదనలు వినిపించేందుకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది. ‘‘ఆ రోజు ఆయన రాకపోతే, కేసును ముగించేస్తాం’’ అని సీజేఐ స్పష్టం చేశారు.

Updated Date - Nov 07 , 2025 | 05:51 AM