Electronic Components : సైనిక డ్రోన్ల తయారీలో చైనా ఎలకా్ట్రనిక్ విడిభాగాలు!
ABN , Publish Date - Feb 08 , 2025 | 05:31 AM
చైనాకు చెందిన ఎలకా్ట్రనిక్ విడిభాగాలను వాడుతున్నట్లు తేలటంతో.. దేశీయ పరిశ్రమలకు ఇచ్చిన రూ.230 కోట్ల విలువైన డ్రోన్ల కాంట్రాక్టును సైన్యం రద్దు చేసింది. తూర్పు లఢక్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి 400 డ్రోన్లను మోహరించాలని నిర్ణయించిన

సైన్యం దర్యాప్తులో వెల్లడి.. దేశీయ పరిశ్రమలకు ఇచ్చిన రూ.230 కోట్ల కాంట్రాక్టు రద్దు
దేశ రక్షణకు విఘాతం దృష్ట్యా కఠిన చర్యలు
ఎల్‌ఏసీ వెంట 400 డ్రోన్లతో నిఘాకు గతంలో నిర్ణయం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: చైనాకు చెందిన ఎలకా్ట్రనిక్ విడిభాగాలను వాడుతున్నట్లు తేలటంతో.. దేశీయ పరిశ్రమలకు ఇచ్చిన రూ.230 కోట్ల విలువైన డ్రోన్ల కాంట్రాక్టును సైన్యం రద్దు చేసింది. తూర్పు లఢక్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి 400 డ్రోన్లను మోహరించాలని నిర్ణయించిన సైన్యం.. ఆ కాంట్రాక్టును ఇటీవల దేశీయ పరిశ్రమలకు ఇచ్చింది. వీటిలో 100 తేలికపాటి డ్రోన్లు కాగా, 200 మధ్యస్థాయివి, 100 భారీ (హెవీవెయిట్) డ్రోన్లు. ఈ డ్రోన్ల తయారీలో చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఎలకా్ట్రనిక్ విడిభాగాలను వాడుతున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఇది దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశం కావటంతో, కాంట్రాక్టును సైన్యం గతేడాది ఆగస్టులోనే తాత్కాలికంగా నిలిపివేసి ఈ అంశంపై దర్యాప్తు జరిపింది. ఆరోపణలు నిజమేనని తేలటంతో దేశీయ కంపెనీలకు ఇచ్చిన కాంట్రాక్టును మొత్తంగా రద్దు చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. రక్షణరంగ ఉత్పత్తుల్లో చైనా సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్లను ఉపయోగించవద్దంటూ ‘మిలిటరీ నిఘా విభాగం డైరెక్టరేట్ జనరల్’ 2010, 2015ల్లోనే హెచ్చరికలు జారీ చేసింది. అయినప్పటికీ, ఉల్లంఘనలు జరుగుతున్నాయి. గతేడాది ఆగస్టులో కశ్మీర్‌లోని రాజౌరీలో మోహరించిన ఓ డ్రోన్‌పై సైన్యం నియంత్రణ కోల్పోయింది. ఆ డ్రోన్ పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన నేపథ్యంలో, మిలిటరీ డ్రోన్లలో చైనా విడిభాగాల వాడకంపై సైన్యం నిషేధాన్ని అమలు చేసింది.