Share News

Israel: ఇరాన్‌కు చైనా ఆయుధాలు?

ABN , Publish Date - Jun 21 , 2025 | 06:21 AM

ఇజ్రాయెల్‌ భీకర దాడులతో కుదేలవుతున్న ఇరాన్‌కు.. చైనా ఆయుధాలు సరఫరా చేస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Israel: ఇరాన్‌కు చైనా ఆయుధాలు?

  • రహస్యంగా మూడు విమానాల్లో తరలింపు?

టెహ్రాన్‌, టెల్‌ అవీవ్‌, జూన్‌ 20: ఇజ్రాయెల్‌ భీకర దాడులతో కుదేలవుతున్న ఇరాన్‌కు.. చైనా ఆయుధాలు సరఫరా చేస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధం మొదలైన రెండు రోజుల తర్వాత.. షాంఘై సహా చైనాలోని మూడు నగరాల నుంచి లగ్జెంబర్గ్‌కు రోజుకొకటి చొప్పున బయల్దేరిన మూడు బోయింగ్‌ 747 విమానాలు కజకిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, తుర్క్‌మెనిస్థాన్‌ మీదుగా వెళ్తూ ఇరాన్‌ సమీపానికి రాగానే రాడార్ల నుంచి మాయమైపోయాయి. బయల్దేరింది లగ్జెంబర్గ్‌కి అయినప్పటికీ.. ఆ విమానాలు ఇప్పటికీ యూరప్‌ దరిదాపులకు రాకపోవడం గమనార్హం. బోయింగ్‌ 747లను సాధారణంగా పెద్ద ఎత్తున యుద్ధసామగ్రిని తరలించడానికి వినియోగిస్తుంటారు. చైనాకు ముడిచమురు సరఫరా చేసే దేశాల్లో అత్యంత కీలకమైనది ఇరానే.


ఆ దేశం నుంచి డ్రాగన్‌ దేశానికి నిత్యం 20 లక్షల బ్యారెళ్ల ముడిచమురు సరఫరా అవుతుంటుంది. . అందుకే ఇరాన్‌కు మద్దతుగా చైనా ఆ మూడు రవాణా విమానాల్లో ఆయుధాలు పంపించి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. ఇరాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌కు అమెరికా, జర్మనీ ప్రత్యక్షంగానే ఆయుధాలు సరఫరా చేస్తున్నాయి. కిందటి శుక్రవారం యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా యుద్ధ సామగ్రి, పరికరాలతో కూడిన 14 సైనిక రవాణా విమానాలను ఆ దేశాలు తమకు పంపినట్టు ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. 2023 అక్టోబరులో హమాస్‌పై యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ రెండు దేశాలూ తమకు 800 విమానాల్లో పంపిన ఆయుధాలకు ఇవి అదనమని అందులో పేర్కొంది.

Updated Date - Jun 21 , 2025 | 06:21 AM