Share News

RG Kar Incident: R G కర్ మెడికల్ కాలేజ్‌లో అత్యాచార ఘోరానికి ఏడాది.. కోల్‌కతాలో తీవ్ర ఉద్రిక్తత

ABN , Publish Date - Aug 09 , 2025 | 06:17 PM

కోల్‌కతా లోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై అత్యాచార ఘటన జరిగి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా బెంగాల్ మళ్లీ ఒక్కసారిగా అట్టుడికింది. తమకు న్యాయం చేయాలని కోరుతూ..

RG Kar Incident: R G కర్ మెడికల్ కాలేజ్‌లో అత్యాచార ఘోరానికి ఏడాది.. కోల్‌కతాలో తీవ్ర ఉద్రిక్తత
Chaos At RG Kar Protest

కోల్‌కతా, ఆగష్టు 9 : కోల్‌కతా లోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై అత్యాచార ఘటన జరిగి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా బెంగాల్ మళ్లీ ఒక్కసారిగా అట్టుడికింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కార్యాలయం ఉన్న రాష్ట్ర సచివాలయం నబన్నాకు ఈ ఉదయం జరిగిన నిరసన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. వీరిలో పోలీసులు కూడా ఉన్నారు.

ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ విద్యార్థినిపై దారుణ సామూహిక అత్యాచార ఘటన జరిగి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా బాధితురాలి తల్లిదండ్రులు 'నబన్నా అభియాన్'కు పిలుపునిచ్చారు. ఈ పిలుపుకు బెంగాల్ రాజధాని కోల్ కతాలో విపరీతమైన ప్రతిస్పందన లభించింది. నబన్నా అభియాన్ కు మద్దతుగా అనేక మంది ర్యాలీలో పాల్గొని తమ నిరసన వెలిబుచ్చారు. దీంతో పలు చోట్ల పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Bengal-Agitation-4.jpgపోలీసు చర్యలో తన తలకు గాయమైందని మృతురాలి తల్లి ఆరోపించారు. 'వాళ్లు మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు? మాకు కావలసిందల్లా సచివాలయానికి చేరుకుని నా కూతురికి న్యాయం చేయాలని కోరడమే' అని మృతురాలి తల్లిదండ్రులు అంటున్నారు. ర్యాలీకి కోర్టు అనుమతి ఉన్నప్పటికీ, ప్రభుత్వం మార్చ్‌లో పాల్గొనకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని మృతురాలి తండ్రి ఆరోపించారు.

గత సంవత్సరం ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్ జీ కర్ ఆసుపత్రిలో జరిగిన యువ వైద్యురాలి అత్యాచారం, హత్య దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా వైద్యులు తమ ఆందోళనలను వ్యక్తం చేసి సమ్మెకు దిగారు. ఈ జనవరిలో ఈ కేసులో పౌర పోలీసు వాలంటీర్ అయిన సంజయ్ రాయ్‌ను దోషిగా నిర్ధారించడంతో అతనికి జీవిత ఖైదు విధించారు.

Bengal-Agitation.jpg


అయితే, బాధితురాలి తల్లిదండ్రులు ఈ విచారణతో ఏకీభవించడం లేదు. వారు ఇటీవల ఢిల్లీలో సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌ను కలిసి, తమ కుమార్తెపై జరిగిన అత్యాచార హత్య కేసులో ఏజెన్సీ దర్యాప్తు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

కోల్‌కతాకు తిరిగి వచ్చిన బాధిత తల్లిదండ్రులు ముఖ్యమంత్రిని కలవాలని ఆశిస్తూ నబన్న వద్దకు భారీ ర్యాలీ నిర్వహించారు. భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తారని గ్రహించిన పోలీసులు, ముఖ్యంగా నబన్న ఉన్న హౌరా జిల్లాలో, ఆ రోడ్డు మార్గంలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.

Bengal-Agitation-9.jpgఅయితే, నిరసనకారులు హెచ్చరికలను పట్టించుకోకుండా, పలు చోట్ల పోలీసులతో ఘర్షణకు దిగారు. హౌరాలోని సంత్రాగచి వద్ద, ఇనుప బారికేడ్లను ఛేదించడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. హౌరాను కలిపే విద్యాసాగర్ సేతు వైపు వెళ్లేందుకు నిరసన కారులు ప్రయత్నించినప్పుడు పార్క్ స్ట్రీట్ క్రాసింగ్ వద్ద కూడా వారిపై లాఠీచార్జ్ జరిగింది.

పోలీసు చర్యలో కనీసం 100 మంది నిరసనకారులు గాయపడ్డారని బిజెపి అంటోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి, ఇతర బిజెపి ఎమ్మెల్యేలు పార్క్ స్ట్రీట్-జవహర్‌లాల్ నెహ్రూ రోడ్ క్రాసింగ్ వద్ద నిరసన తెలిపారు.

Bengal-Agitation-1.jpg

Updated Date - Aug 09 , 2025 | 06:37 PM