Telecom Companies: టెల్కోల ఏజీఆర్ బకాయిల మాఫీకి కేంద్రం యోచన
ABN , Publish Date - Jan 19 , 2025 | 03:52 AM
దేశీయ టెలికాం కంపెనీలపై ఉన్న కొండంత ఆర్థిక భారాన్ని దించే దిశగా కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
న్యూఢిల్లీ, జనవరి 18: దేశీయ టెలికాం కంపెనీలపై ఉన్న కొండంత ఆర్థిక భారాన్ని దించే దిశగా కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా పలు టెలికాం సంస్థలు చెల్లించాల్సి ఉన్న సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్) బకాయిల్లో పెద్ద మొత్తాన్నే మాఫీ చేసే ఆలోచన చేస్తున్నట్టు కథనాలు వెలువడ్డాయి. ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుంటే టెలికాం కంపెనీలకు భారీ ఊరట లభిస్తుంది. క్రితం స్పెక్ట్రమ్ బకాయిలకు సంబంధించి బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వాల్సిన అవసరం లేదని గతేడాది డిసెంబరులో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో టెలికాం కంపెనీలు ఊపిరిపీల్చుకున్నాయి. ఇప్పుడు ఏజీఆర్ బకాయిలను తగ్గించే ఆలోచన చేస్తున్నట్టు వస్తున్న కథనాలతో ఆ కంపెనీల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. 50ు వడ్డీతోసహా పెనాల్టీలు, పెనాల్టీలపై వడ్డీని 100ు మేర మాఫీ చేయాలని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఈ ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తే టెలికాం ఆపరేట్లకు రూ.లక్ష కోట్లకు పైగా ఆర్థిక ఊరట లభించనుందని సమాచారం. అయితే ఇందులో సగానికి పైగా వొడాఫోన్ ఐడియా (వీఐ)కే ప్రయోజనం కలగడానికి అవకాశం ఉంది. వీఐ ఏజీఆర్ బకాయిలను దాదాపు రూ.52వేల కోట్లకు పైగా, ఎయిర్‌టెల్ బకాయిలు దాదాపు రూ.38వేల కోట్లు, టాటా టెలీ సర్వీసెస్ బకాయిలు రూ.14వేల కోట్ల మేర తగ్గవచ్చన్న అంచనాలు వస్తున్నాయి. 2019లో సుప్రీంకోర్టు తీర్పుతో టెలికాం కంపెనీలపై దాదాపు రూ.1.47 లక్షల కోట్ల ఏజీఆర్ బకాయిల భారం పడింది.