Share News

Flood Zone Guidelines: నదులకు 100 మీటర్ల వరకు నిర్మాణాలపై నిషేధం

ABN , Publish Date - Aug 14 , 2025 | 03:06 AM

వరద ప్రవాహ ప్రాంతాల జోనింగ్‌ను కేంద్ర ప్రభుత్వం మూడుగా విభజించింది. అవి.. రక్షిత ప్రొటెక్టెడ్‌, నియంత్రిత..

Flood Zone Guidelines: నదులకు 100 మీటర్ల వరకు నిర్మాణాలపై నిషేధం

  • 500 మీటర్ల దూరం వరకు కూడా ఆంక్షలు

  • మూడు జోన్లుగా నదీ తీరాలు

  • రక్షిత, నియంత్రిత, హెచ్చరిక జోన్లుగా ఏర్పాటు

  • కేంద్రం మార్గదర్శకాలు విడుదల.. వరద ప్రవాహ మ్యాపింగ్‌ పూర్తయ్యే వరకు కఠినంగా అమలు

న్యూఢిల్లీ, ఆగస్టు 13: వరద ప్రవాహ ప్రాంతాల జోనింగ్‌ను కేంద్ర ప్రభుత్వం మూడుగా విభజించింది. అవి.. రక్షిత(ప్రొటెక్టెడ్‌), నియంత్రిత(రెగ్యులేటరీ), హెచ్చరిక(వార్నింగ్‌) జోన్‌లు. ప్రవహించే నదుల నుంచి 100 మీటర్ల వరకు ‘నో డెవల్‌పమెంట్‌ జోన్‌’గా ప్రకటించింది. అంతేకాదు.. 500 మీటర్ల దూరం వరకు నిషేధాజ్ఞలు అమలవుతాయి. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ‘ఫ్లడ్‌ ప్లెయిన్‌ జోనింగ్‌’ పేరుతో వరద ప్రవాహ ప్రాంతాల్లో సాంకేతిక మార్గదర్శకాలను విడుదల చేసింది. గత ఏడాది బడ్జెట్‌లో ప్రకటించిన వరద ప్రవాహ మ్యాపింగ్‌ పూర్తయ్యే వరకు ఈ మార్గదర్శకాలు అమలవుతాయి. ఈ మార్గదర్శకాలను కేంద్రం గత నెల సూత్రప్రాయంగా ఆమోదించగా.. తాజాగా వాటి వివరాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపింది. ఉపగ్రహ డాటా, హైడ్రాలజికల్‌ మోడలింగ్‌, వాతావరణ మార్పులు, ప్రవాహ ప్రాంతాల మ్యాపింగ్‌ పూర్తిచేయాలని, భూ వినియోగ ప్రణాళికను రెవెన్యూ రికార్డుల్లో పొందుపర్చాలని సూచించింది. పైన పేర్కొన్న మూడు జోన్లతోపాటు.. సున్నిత ప్రాంతాల్లో కార్యకలాపాల నిషేధం, పర్యావరణ పరిరక్షణకు ఏకరీతి ప్రమాణాల ఏర్పాటు వంటి అంశాలున్నాయి. నదీతీరాల నుంచి 500 మీటర్ల దూరం వరకు ల్యాండ్‌ఫిల్‌ సైట్లు, మునిసిపల్‌, పరిశ్రమల వ్యర్థాల పారవేతపై నిషేధం ఉంటుంది.

  • ప్రతి ఐదేళ్లకు ఒకసారి వరదలు పునరావృతమయ్యే ప్రాంతాన్ని కేంద్రం ప్రొటెక్టెడ్‌ జోన్‌గా ప్రకటించింది. తాజా మార్గదర్శకాల ప్రకారం ఈ జోన్‌లో శాశ్వత నిర్మాణాలు, వ్యర్థాలను పారవేయడం, ప్రమాదకర పదార్థాల నిల్వ నిషేధం.

  • ప్రతి ఐదేళ్లకోసారి.. అదేవిధంగా పాతికేళ్లకు ఒకసారి వరదలు వచ్చే ప్రాంతాన్ని రెగ్యులేటరీ జోన్‌గా ప్రకటించారు. ఈ జోన్‌లో కార్యకలాపాలను కఠినంగా నియంత్రిస్తారు.

  • ప్రతి పాతికేళ్లకు ఒకసారి.. అదేవిధంగా ప్రతి 100 ఏళ్లకు ఒకసారి వరదలు వచ్చే ప్రాంతాన్ని వార్నింగ్‌ జోన్‌గా కేంద్రం మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. ఇక్కడ తక్కువ ప్రమాదకర కార్యకలాపాలకు అనుమతి ఉన్నా.. ముప్పు అంచనాకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటారు.

Updated Date - Aug 14 , 2025 | 03:06 AM