Finance Minister Nirmala Sitharaman: జీఎస్టీ 2.0పై కేంద్ర మంత్రుల హర్షం
ABN , Publish Date - Oct 19 , 2025 | 04:06 AM
వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) 2.0 సంస్కరణలు ఊహించని ఫలితాలు ఇస్తున్నాయని, ప్రజలకు మేలు చేస్తున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
న్యూఢిల్లీ, అక్టోబరు 18: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) 2.0 సంస్కరణలు ఊహించని ఫలితాలు ఇస్తున్నాయని, ప్రజలకు మేలు చేస్తున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. జీఎస్టీ శ్లాబులు తగ్గించిన కారణంగా అనేక వస్తువుల ధరలు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయని, ఫలితంగా వాటి విక్రయాలు పుంజుకున్నాయని తెలిపారు. ‘‘కొన్ని వస్తువుల ధరలు అనుకున్న దానికంటే ఎక్కువగా దిగివచ్చాయి’’ అని వ్యాఖ్యానించారు. శనివారం ధన త్రయోదశిని పురస్కరించుకుని శనివారం ఢిల్లీలో కేంద్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, మరో మంత్రి పీయూష్ గోయెల్‌తో కలిసి ఆర్థిక మంత్రి.. ‘జీఎస్టీ పొదుపు ఉత్సవ్’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో మీడియాతో మాట్లాడారు. జీఎస్టీ సంస్కరణలతో భారత ఆర్థిక వ్యవస్థ తారాజువ్వలా పుంజుకోనుందన్నారు. జీడీపీ 6.6 శాతానికి చేరుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసిందని తెలిపారు. ఇదంతా ప్రధాని మోదీ నాయకత్వ పటిమకు నిదర్శనమని పేర్కొన్నారు.