Medicine Quality: 84 ఔషధాలు నాసిరకం
ABN , Publish Date - Feb 24 , 2025 | 06:00 AM
ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో వైద్యులు సాధారణంగా సూచించే స్టెరాయిడ్లు, మధుమేహం, కొలెస్ట్రాల్, ఎసిడిటీని తగ్గించే మందులతో సహా 84 బ్యాచ్‌ల ఔషధాలు నాణ్యత లేనివిగా తేలిందని వెల్లడించింది.

నాణ్యత పరీక్షలో విఫలం: సీడీఎస్‌సీవో
జాబితాలో మధుమేహం, కొలెస్ట్రాల్, గ్యాస్ట్రిక్ మందులు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: భారత్‌లో మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, గ్యాస్ట్రిక్ సమస్యలకు సంబంధించిన మందులను రోజూ లక్షలాది మంది వినియోగిస్తుంటారు. అయితే ఈ మందుల నాణ్యతపై సీడీఎ్‌ససీవో (సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్) కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో వైద్యులు సాధారణంగా సూచించే స్టెరాయిడ్లు, మధుమేహం, కొలెస్ట్రాల్, ఎసిడిటీని తగ్గించే మందులతో సహా 84 బ్యాచ్‌ల ఔషధాలు నాణ్యత లేనివిగా తేలిందని వెల్లడించింది. సీడీఎ్‌ససీవో కొత్త ఔషధాలు, క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతిస్తుంటుంది. అలాగే ప్రతినెలా మార్కెట్ నుంచి పలురకాల మందుల శాంపిల్స్‌ను సేకరించి పరీక్షిస్తుంటుంది. అవి నిర్ణీత ప్రమాణాలను అందుకోవడంలో విఫలమయ్యాయని తేలితే ఆ మందుల విక్రయంపై ఇలా హెచ్చరికలు జారీ చేస్తుంటుంది.
ఈ క్రమంలో 2024 డిసెంబరు నాటికి వివిధ సంస్థలు తయారు చేసిన 84 బ్యాచ్‌ల మందులు నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా లేవని గుర్తించినట్టు తాజాగా వెల్లడించింది. ఈ మందులను మార్కెట్ నుంచి తొలగించేలా చూస్తామని తెలిపింది. తనిఖీల కోసం సీడీఎ్‌ససీవో ఇటీవల కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. డ్రగ్ ఇన్‌స్పెక్టర్లందరూ నెలకు కనీసం 10 శాంపిల్స్‌ను సేకరించాలని. అలాగే శాంపిల్స్‌ను సేకరించిన రోజే వాటిని ల్యాబ్‌కు పంపేలా చర్యలు తీసుకోవాలని కొత్త మార్గదర్శకాల్లో తెలిపింది.