CBSE: పదో తరగతి పరీక్షలు క ఏటా రెండు సార్లు
ABN , Publish Date - Feb 26 , 2025 | 04:57 AM
ఇకపై ఏటా రెండు విడతలుగా పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని సీబీఎ్‌సఈ ప్రతిపాదించింది. 2026 నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను మంగళవారం జనబాహుళ్యంలోకి అందుబాటులో ఉంచింది.

సీబీఎ్‌సఈ ప్రతిపాదన.. 2026 నుంచి అమల్లోకి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: ఇకపై ఏటా రెండు విడతలుగా పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని సీబీఎ్‌సఈ ప్రతిపాదించింది. 2026 నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను మంగళవారం జనబాహుళ్యంలోకి అందుబాటులో ఉంచింది. వీటిపై మార్చి 9లోగా అభిప్రాయాలు చెప్పాలని కోరింది. ఫిబ్రవరి 17 నుంచి మార్చి 6 వరకు తొలి విడతగా, మే 5 నుంచి 20 వరకు రెండో విడతగా పరీక్షలు జరపాలని ముసాయిదాలో పేర్కొంది. ‘ఇంప్రూవ్‌మెంట్’ కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ రెండు విడతల్లోనూ పరీక్షలు రాసే అవకాశం ఉంది. ఇంప్రూవ్‌మెంట్ కోసం కొన్ని సబ్జెక్టులను మాత్రమే ఎంచుకునే సౌలభ్యం కూడా ఉంది. రెండు విడతల్లోనూ మొత్తం సిలబ్‌సకు పరీక్షలు జరుపుతారు. రెండు విడతలకు కూడా ఒకే పరీక్ష కేంద్రాన్ని కేటాయిస్తారు. ఎలాంటి మార్పులు చేయబోరు. 2026 ఫిబ్రవరిలో పరీక్షలు రాసే విద్యార్థుల జాబితాను 2025 సెప్టెంబరు నాటికే తయారు చేస్తారు. ఈ జాబితాలో పేరు ఉన్నవారికి మాత్రమే 2026 మేలో జరిగే పరీక్షలకు అనుమతి ఇస్తారు. ఒక్కసారి జాబితాను ఖరారు చేసిన తరువాత సబ్జెక్టులను మార్చుకునే అవకాశం విద్యార్థులకు ఉండదు.