Vehicle Tax Cut: షికారు కోసం కాస్త ఆగండి
ABN , Publish Date - Sep 05 , 2025 | 04:50 AM
కొత్త కారు కొనుక్కుని షికారు చేయాలను కుంటున్నారా? షోరూమ్‌కు వెళ్లడానికి సిద్ధమవుతున్నారా..
ఈ నెల 22 నుంచి కొత్త పన్ను రేట్లతో గణనీయంగా తగ్గనున్న కార్ల ధరలు
రూ.లక్షన్నర దాకా ఆదా.. లైఫ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ చార్జీల్లోనూ తగ్గుదల
నిరుటితో పోలిస్తే తగ్గిన కార్ల కొనుగోలు.. పన్ను తగ్గింపుతో పెరిగే అవకాశం
రూ. 10 లక్షల్లోపు కార్ల విక్రయాలు పెరుగుతాయని అంచనా
రూ.80 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు ఆదా
జీవితకాల పన్ను, రిజిస్ట్రేషన్ చార్జీల ఉపశమనం కూడా
ద్విచక్ర వాహనాలపై రూ.10-25 వేల వరకు మిగిలే చాన్స్
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): కొత్త కారు కొనుక్కుని షికారు చేయాలను కుంటున్నారా? షోరూమ్‌కు వెళ్లడానికి సిద్ధమవుతున్నారా?.. కాస్త ఆగండి. జీఎస్టీ పన్ను రేట్ల మార్పు ప్రయోజనాన్ని పొందేందుకు కాస్త ఓపిక పట్టండి. ఈనెల 22 తర్వాత కార్ల ధరలు తగ్గనున్నాయి. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఆదరించే చిన్న, మధ్యతరహా కార్లపై రూ.80 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు మిగలనున్నాయి. అయితే జీఎస్టీ మార్పుతో కొన్నికార్ల ధరలు పెరుగుతాయని, ఇప్పుడే కొనుక్కోండి అని కొందరు డీలర్లు గందరగోళానికి గురిచేస్తున్నారని, దీనిపై జాగ్రత్తగా ఉండాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
కొన్ని నెలలుగా మందకొడిగా విక్రయాలు..
రాష్ట్రంలో గత ఏడాదితో పోలిస్తే ఈసారి కార్ల కొనుగోళ్లు తగ్గాయి. తాజాగా కార్లపై జీఎస్టీ 28శాతం నుంచి 18శాతానికి తగ్గుతుండటంతో కొనుగోళ్లు తిరిగి పుంజుకుంటాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాలు కొనుగోలు చేసే చిన్న కార్లకు మార్కెట్‌లో గిరాకీ పెరగనుంది. మారుతి స్విఫ్ట్, వ్యాగన్ ఆర్, బాలెనో, టాటా పంచ్, టియాగో, ఆలో్ట్రజ్, రెనో క్విడ్, హ్యుందాయ్ ఐ10 తదితర వాహనాలపై సుమారు రూ.80 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు తగ్గుతాయని డీలర్లు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం జీఎస్టీ, అదనపు సెస్‌లు కలిపి 42-50ు వరకు పన్ను విధించిన విలాసవంతమైన కార్ల 40ు జీఎస్టీ వేయడం, సెస్‌లు ఎత్తివేస్తుండటంతో భారీ ప్రయోజనం ఉంటుందని డీలర్లు చెబుతున్నారు. హ్యుందాయ్ క్రెటా, మారుతీ గ్రాండ్ విటారా, మహీంద్రా ఎక్స్‌యూవీ 700, టయోటా ఇన్నోవా, టాటా హారియర్ వంటి కార్ల కొనుగోలు దారులకు ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు. వీరికి రూ.2 లక్షల నుంచి 4 లక్షల వరకు ప్రయోజనం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
జీఎస్టీతోపాటు ఇతర పన్నుల ఉపశమం
వాహనం మూల ధరపై జీఎస్టీని కలిపి ఎక్స్‌షోరూం ధరను నిర్ణయిస్తారు. ఈ ఎక్స్‌షోరూం ధరపైనే రవాణాశాఖ జీవితకాల పన్ను, రిజిస్ట్రేషన్, ఇతర చార్జీలను వసూలు చేస్తుంది. ప్రస్తుతం జీఎస్టీ తగ్గుతుండటంతో రవాణాశాఖ పన్నులు, చార్జీలు కూడా తగ్గుతాయి. బీమా సంస్థలు కూడా వాహనం ధర ఆధారంగా ప్రీమియం నిర్ణయిస్తాయి. ఈ లెక్కన బీమా ప్రీమియం కూడా తగ్గుతుంది. దీనితో మొత్తంగా వాహనం కోసం వినియోగదారులు చేసే ఖర్చు తగ్గనుంది.’
మధ్య స్థాయి కార్ల ధరలు పెరగొచ్చు!
1200 సీసీ సామర్థ్యం, 4 మీటర్ల పొడవు లోపున్న కార్లపై జీఎస్టీని 18శాతానికి తగ్గించిన ప్రభుత్వం.. ఆపై సామర్థ్యం, పొడవు ఉన్న కార్లను 40శాతం పన్నురేటుకు మార్చింది. అయితే విలాసవంతమైన కార్లపై ఉన్న అదనపు సెస్‌ల కారణంగా వాటిపై ఇప్పటికే 42-50శాతం వరకు పన్నులు ఉన్నాయి. ఇప్పుడు సెస్‌లు తగ్గించడంతో ఈ కార్లపై భారం తగ్గుతుంది. అయితే నిర్ధారిత సీసీ సామర్థ్యం, పొడవు కన్నా ఎక్కువగా ఉండి.. సుమారు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ధర ఉన్న పలు కార్లపై ప్రస్తుతం 28శాతం జీఎస్టీ మాత్రమే ఉందని, సెస్‌లు లేవని రవాణాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడవి 40శాతం పన్ను రేటులోకి మారడం వల్ల వాటి ధరలు పెరిగే అవకాశం ఉందని అంటున్నాయి. అయితే అవి ఏయే మోడళ్లు అన్నదానిపై పూర్తి స్పష్టత లేదు.

ఆఫర్లు చూపుతూ అమ్ముకునే యత్నంలో డీలర్లు
జీఎస్టీ తగ్గింపుతో ఇప్పటికే కార్లను బుక్ చేసుకున్నవారు కూడా డెలివరీ తీసుకోవడానికి ముందుకు రావడం లేదని డీలర్లు చెబుతున్నారు. ఈ నెల 22 తర్వాత పూర్తి సొమ్ము చెల్లించి, కొత్త జీఎస్టీ ప్రకారం తక్కువ ధరకు తీసుకోవాలని భావిస్తున్నారని అంటున్నారు. కొత్తగా కొనుగోలు చేసేందుకు ఎవరూ రావడం లేదని చెబుతున్నారు. ఈ క్రమంలో కొందరు డీలర్లు మధ్యస్థాయి, పెద్ద కార్లపై సెస్‌లు కొనసాగుతాయని, ధరలు పెరుగుతాయని.. ఇప్పు డే కారు కొనడం మంచిదని చెబుతున్నట్టు తెలిసింది. కానీ ప్రభుత్వం సెస్‌లను తొలగించనుందని రవాణాశాఖ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ద్విచక్ర వాహన కొనుగోలుదారులు కూడా వేచి చూసే ధోరణిలోనే ఉన్నారని... రూ.10-25వేల వరకు కలిసి వస్తున్నప్పుడు హడావుడిగా కొనడం ఎందుకనే భావనలో ఉన్నారని చెబుతున్నారు.