Car Crashes Into Metro Station: మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు బలి..
ABN , Publish Date - Nov 02 , 2025 | 06:54 PM
కారు ప్రమాద ఘటనలో రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. ఓ కారు వేగంగా వెళ్లి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు చనిపోగా.. మరో వ్యక్తి అత్యంత తీవ్రంగా గాయపడ్డాడు.
మహారాష్ట్రలో భీకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు వేగంగా వెళ్లి మెట్రో పిల్లర్‌ను ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆదివారం తెల్లవారుజామున ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో పుణెకు చెందిన 23 ఏళ్ల యశ్ బండారీ, హృతిక్ బండారీ, కుశ్వంత్ తెక్కాణీ కారులో ప్రయాణిస్తున్నారు.
ఆ కారు అత్యంత వేగంగా రోడ్డుపై దూసుకు వెళుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే బండ్ గార్డెన్ మెట్రో స్టేషన్ దగ్గర విషాదం చోటుచేసుకుంది. కారు ఒక్కసారిగా అదుపు తప్పింది. వేగంగా వెళ్లి మెట్రో పిల్లర్‌ను ఢీకొంది. కారు పిల్లర్‌ను ఢీకొన్న వేగానికి నుజ్జునుజ్జయిపోయింది. దీంతో యశ్, హృతిక్ అక్కడికక్కడే చనిపోయారు. కుశ్వంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ రోడ్డుపై వెళుతున్న వారు గాయపడ్డ కుశ్వంత్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
యాక్సిడెంట్ గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు శవాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మద్యం సేవించి కారు నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కారులో మద్యం బాటిళ్లను పోలీసులు గుర్తించారు.
ఇవి కూడా చదవండి
కేసీఆర్ హయాంలో చెరువులు, నాళాల కబ్జాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు: ఎంపీ చామల
బాహుబలి రాకెట్ ప్రయోగం సక్సెస్.. 16 నిమిషాల్లోనే..