Share News

Karnataka Gold Locker Theft: సినిమాను తలపించే బ్యాంకు దోపిడి.. చిన్న తప్పుతో..

ABN , Publish Date - Jul 02 , 2025 | 11:19 AM

Karnataka Gold Locker Theft: విజయ్‌పూర్ జిల్లా మనగౌలిలోని కెనరా బ్యాంకులో దొంగతనం జరిగింది. దొంగలు బ్యాంకు లాకర్‌లోంచి 53 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారాన్ని దోచుకెళ్లారు. అంతేకాదు.. బంగారం దోచిన లాకర్‌లో క్షుద్రపూజలు చేసే బొమ్మను ఉంచి వెళ్లారు.

Karnataka Gold Locker Theft: సినిమాను తలపించే బ్యాంకు దోపిడి.. చిన్న తప్పుతో..
Karnataka Gold Locker Theft

కర్ణాటకలోని విజయ్‌పూర్ జిల్లాలో బ్యాంకు దోపిడీ జరిగింది. దొంగలు బ్యాంకు లాకర్‌లోని బంగారాన్ని ఎత్తుకెళ్లిపోయారు. బంగారం దొంగిలించిన లాకర్‌లో ఓ బొమ్మ పెట్టి వెళ్లారు. దొంగలు ఎత్తుకెళ్లిన ఆ బంగారం విలువ 53 కోట్ల రూపాయలు కావటంతో.. పోలీసులు కేసును సవాల్‌గా తీసుకున్నారు. దర్యాప్తు మొదలెట్టారు. అయితే, దొంగతనానికి కారణం అయిన వ్యక్తి.. పోలీసులు ఊహించిన దానికంటే ఈజీగా దొరికిపోయాడు. కేసు సాల్వ్ అయింది. ఇంతకీ లాకర్‌లో ఉంచిన బొమ్మకు దొంగతనానికి ఏంటి సంబంధం?.. పోలీసులు దొంగల్ని ఎలా పట్టుకున్నారు?...


2025, మే 25.. విజయ్‌పూర్ జిల్లా మనగౌలిలోని కెనరా బ్యాంకులో దొంగతనం జరిగింది. దొంగలు బ్యాంకు లాకర్‌లోంచి 53 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారాన్ని దోచుకెళ్లారు. అంతేకాదు.. బంగారం దోచిన లాకర్‌లో క్షుద్రపూజలు చేసే బొమ్మను ఉంచి వెళ్లారు. బ్యాంకు మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే, ఆ దొంగతనానికి.. లాకర్‌లో ఉంచిన బొమ్మకు సంబంధం ఏంటన్నది పోలీసులకు అర్థం కాలేదు. దొంగతనం జరిగిన రోజు బ్యాంకు చుట్టు పక్కల ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను తెప్పించుకున్నారు.


వాటిని పరీక్షించారు. దొంగతనం జరిగిన రోజు ఓ కారు అనుమానాస్పదంగా కనిపించింది. దొంగతనం జరగడానికి ముందు.. దొంగతనం జరిగిన తర్వాత బ్యాంకు దగ్గర ఆ కారు తిరుగుతూ కనిపించింది. పోలీసులు ఆ కారు యజమాని వివరాలు కనుక్కున్నారు. ఆ కారు విజయ్ కుమార్ మిరియాలకు చెందిందిగా తేలింది. అతడి గురించి పూర్తి వివరాలు కనుక్కోగా అసలు విషయం బయటపడింది. మే 8వ తేదీ వరకు అతడు అదే బ్యాంకులో మేనేజర్‌గా పని చేశాడు. మే 9వ తేదీన వేరే బ్యాంకుకు ట్రాన్స్‌ఫర్ అయ్యాడు.


వేరే బ్యాంకుకు ట్రాన్స్‌ఫర్ అయిన వ్యక్తికి దొంగతనం జరిగిన రోజు ఆ బ్యాంకు దగ్గర పనేముందని పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించారు. దొంగతనం తానే చేయించినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు అతడితో పాటు దొంగతనానికి పాల్పడ్డ మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 10 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. లాకర్‌లో పెట్టిన బొమ్మ గురించి ఆరా తీయగా.. కేసును తప్పుదోవ పట్టించడానికి అలా చేసినట్లు చెప్పారు.


ఇవి కూడా చదవండి

పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన క్వాడ్ దేశాలు

పెళ్లై నెలన్నర.. ఊహించని నిర్ణయం తీసుకున్న యువతి..

Updated Date - Jul 02 , 2025 | 11:49 AM