Newlywed Woman: పెళ్లై నెలన్నర.. ఊహించని నిర్ణయం తీసుకున్న యువతి..
ABN , Publish Date - Jul 02 , 2025 | 08:55 AM
Newlywed Woman: జూన్ 28వ తేదీన పురుగుల మందు తీసుకుని కారులో సెవూర్ సమీపంలోని చెట్టిపుదుర్‌కు వెళ్లింది. కారును రోడ్డు పక్క నిలిపి.. కొంతదూరం నడుచుకుంటూ వెళ్లింది. జనం ఎవ్వరూ లేని చోట పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకుంది.
తమిళనాడులో ఓ విషాదం చోటుచేసుకుంది. అదనపు కట్నం వేధింపులు భరించలేక ఓ యువతి ప్రాణాలు తీసుకుంది. అత్తింటి వారి చిత్ర హింసలు తట్టుకోలేక పెళ్లైన నెలన్నరకే ఆ యువతి ఈ దారుణమైన నిర్ణయం తీసుకుంది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, తిరుప్పూర్‌కు చెందిన 27 ఏళ్ల రితన్యకు అదే ప్రాంతానికి చెందిన కవిన్ కుమార్ అనే యువకుడితో నెలన్నర క్రితం పెళ్లయింది.
పెళ్లి సందర్భంగా 300 నుంచి 500 గ్రాముల బంగారం ఇస్తానని యువతి తండ్రి పెళ్లి కొడుకు కుటుంబానికి చెప్పాడు. అయితే, చెప్పిన దానికంటే తక్కువ బంగారం ఇచ్చి కూతుర్ని కాపురానికి పంపాడు. ఇది అత్తింటి వాళ్లు సహించలేకపోయారు. అదనపు కట్నం కావాలంటూ రితన్యను వేధించసాగారు. భర్త కవిన్ ఆమెను శారీరకంగా హింసించేవాడు. అత్తామామలు మానసికంగా హింసించే వారు.
రోజు రోజుకు వేధింపులు పెరుగుతూ పోయాయి. దీంతో రితన్య తట్టుకోలేకపోయింది. అత్తింటి వారిని ఎదురించలేక.. పుట్టింటి వారికి తన బాధను చెప్పుకోలేక నరకం చూసింది. ఈ నేపథ్యంలోనే ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. జూన్ 28వ తేదీన పురుగుల మందు తీసుకుని కారులో సెవూర్ సమీపంలోని చెట్టిపుదుర్‌కు వెళ్లింది. కారును రోడ్డు పక్క నిలిపి.. కొంతదూరం నడుచుకుంటూ వెళ్లింది. జనం ఎవ్వరూ లేని చోట పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకుంది.
చనిపోయే ముందు తండ్రికి వాట్సాప్ ద్వారా ఓ వాయిస్ మెసేజ్ పెట్టింది. అందులో..‘ప్రతీరోజూ నన్ను దారుణంగా హింసిస్తున్నారు. మానసికంగా చిత్రహింసలు పెడుతున్నారు. కవిన్ కుమార్ శారీరకంగా హింసిస్తున్నాడు. డబ్బు కోసమే కవిన్ నన్ను పెళ్లి చేసుకున్నాడు. వారి టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. బతకాలని లేదు. నువ్వు, అమ్మే నా ప్రపంచం. మీరు నన్ను క్షమించండి’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక, రితన్య తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కవిన్ కుటుంబసభ్యుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
గాల్లో ఉండగా సాంకేతిక లోపం.. తర్వాత ఏం జరిగిందంటే..
పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..