Supreme Court: ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలుగవర్నర్ల దయాదాక్షిణ్యాలపై నడవాలా
ABN , Publish Date - Aug 21 , 2025 | 03:30 AM
రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలు.. గవర్నర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి పనిచేయాలా అని సుప్రీంకోర్టు కేంద్ర సర్కారును ప్రశ్నించింది...
ఇష్టానుసారంగా బిల్లులను తొక్కిపెట్టవచ్చా?
రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఇన్నేళ్లుగా
మన దేశ నిర్మాతల ఆకాంక్షలను నెరవేరుస్తున్నారా?
కేంద్రానికి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ప్రశ్నలు
వారికేమైనా సంపూర్ణ అధికారాలు ఉన్నాయా?
న్యూఢిల్లీ, ఆగస్టు 20: రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలు.. గవర్నర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి పనిచేయాలా అని సుప్రీంకోర్టు కేంద్ర సర్కారును ప్రశ్నించింది. ఇష్టానుసారంగా ఆయన బిల్లులను తొక్కిపెట్టి వాటిని విఫలం చేయొచ్చా అని నిలదీసింది. బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతికి, గవర్నర్లకు నిర్దిష్ట కాలవ్యవధిని సుప్రీంకోర్టు నిర్దేశించవచ్చా అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగంలోని 143(1) అధికరణ కింద సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయాన్ని తెలుసుకోగోరిన సంగతి తెలిసిందే. దానిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందూర్కర్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది. బుధవారం విచారణ కొనసాగించింది. రాజ్యాంగంలోని 200వ అధికరణ ప్రకారం.. రాష్ట్రప్రభుత్వం పంపే బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ పెండింగ్‌లో పెడితే.. అవి మురిగిపోయినట్లేనని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. అయితే ఎన్నికైన ప్రభుత్వాల వినతులను (బిల్లులను) తేల్చకుండా పెండింగ్‌లో ఉంచే సంపూర్ణ అధికారాలను గవర్నర్లకు ఇచ్చారా అని ఆయన్ను చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. ‘గవర్నర్లు బిల్లులను పక్కనపెట్టేస్తే.. మెజారిటీ సంఖ్యాబలంతో ఏర్పడిన ప్రభుత్వాలు వారి ఇష్టాయిష్టాలపై ఆధారపడాలా? రాష్ట్రప్రభుత్వాలు, గవర్నర్ల నడుమ అసలు సామరస్యం ఉందా’ అని అడిగారు. దీనికి తుషార్ మెహతా సమాధానమిస్తూ.. గవర్నర్ బిల్లులను ఆమోదించకపోవడం అత్యంత అరుదైన విషయమని, రాష్ట్ర బిల్లు దేశ ప్రజాస్వామ్య సంకల్పానికి విరుద్ధంగా ఉన్నప్పుడు.. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేదిగా ఉన్నప్పుడు.. ప్రస్తుత కేంద్ర చట్టానికి విరుద్ధంగా ఉన్నప్పుడు ఆమోదించకుండా నిలిపివేయవచ్చని పేర్కొన్నారు. ఈ దశలో సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ జోక్యం చేసుకుని.. బిల్లును మురిగిపోయేలా చేసే అధికారం గవర్నర్‌కు ఉన్నట్లయితే.. ఇదే లాజిక్ 111వ అధికరణ కింద భారత రాష్ట్రపతికి కూడా వర్తిస్తుందని.. పార్లమెంటు ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా రాష్ట్రపతి కూడా నిలిపివేయవచ్చని తెలిపారు. గవర్నర్లు అప్రధాన వ్యక్తులు కాదని.. వారు కేంద్ర కేబినెట్ సలహా సహకారాలతో వ్యవహరించే రాష్ట్రపతికి ప్రతినిధులని మెహతా గుర్తుచేశారు. గవర్నర్‌గిరీ అనేది రిటైర్డ్ రాజకీయ నాయకులకు స్వర్గధామం వంటిది కాదని తెలిపారు. జస్టిస్ గవాయ్ జోక్యం చేసుకుని.. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఇన్నేళ్లుగా మన దేశ నిర్మాతల ఆకాంక్షలను నెరవేర్చుతున్నారా అని ప్రశ్నించారు. గవర్నర్లు, ఎన్నికైన ప్రభుత్వాలు సామరస్యంగా మెలగాల్సి ఉందని.. అలా ఉంటున్నారా అని అడిగారు. రాజ్యాంగ ధర్మాసనం విచారణ గురువారం కొనసాగనుంది.