Share News

Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌తో.. సర్కారుకు 2 వేల కోట్ల నష్టం

ABN , Publish Date - Feb 26 , 2025 | 04:43 AM

ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంగళవారం సీఎం రేఖాగుప్తా కాగ్‌ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లొసుగులకు సంబంధించి కాగ్‌ 20 అంశాలను లేవనెత్తగా..

Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌తో.. సర్కారుకు 2 వేల కోట్ల నష్టం

ఉత్పత్తి, అమ్మకాల లెక్కలే లేవు: కాగ్‌

అసెంబ్లీలో నివేదిక.. ఆప్‌ గందరగోళం

21 మంది ఆప్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): లిక్కర్‌ స్కామ్‌తో ఢిల్లీ ప్రభుత్వానికి రూ.2002.68 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) స్పష్టం చేసింది. ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంగళవారం సీఎం రేఖాగుప్తా కాగ్‌ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లొసుగులకు సంబంధించి కాగ్‌ 20 అంశాలను లేవనెత్తగా.. వాటిల్లో ఒకటి-- మద్యం విధానం-2021తో నష్టాల చిట్టాపై అసెంబ్లీలో చర్చ జరుగుతుండగా.. ఆప్‌ ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకించారు. వారు గందరగోళం సృష్టించడంతో స్పీకర్‌ విజేంద్రగుప్తా 21 మంది ఆప్‌ ఎమ్మెల్యేలు రెండ్రోజులపాటు సస్పెండ్‌ చేశారు.

54.jpg

కాగ్‌ లేవనెత్తిన అంశాలు..

మద్యం పాలసీ-2021లో అడుగడుగునా ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్లు కాగ్‌ స్పష్టం చేసింది. సరెండర్‌ చేసిన రిటైల్‌ లైసెన్స్‌ల స్థానంలో మళ్లీ టెండర్లను ఆహ్వానించలేదని, దీని వల్ల ప్రభుత్వానికి రూ.890.15 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు స్పష్టం చేసింది. జోనల్‌ లైసెన్సుల మినహాయింపు వల్ల మరో రూ.941.53 కోట్లు, సెక్యూరిటీ డిపాజిట్లను సరిగా వసూలు చేయకపోవడం వల్ల రూ.27 కోట్లు, కొవిడ్‌ లాక్‌డౌన్ల పేరుతో అడ్డగోలు మినహాయింపులతో ఇంకో రూ.144 కోట్లు.. ఇలా మొత్తం 2002.68 కోట్ల మేర ప్రభుత్వం నష్టపోయినట్లు కాగ్‌ నివేదిక వెల్లడించింది. ‘‘కొత్త మద్యం పాలసీ రూపకల్పనకు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫారసులను అప్పటి ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా విస్మరించారు’’ అని కాగ్‌ వివరించింది.



సగం నాటు మద్యమే

2021 మద్యం పాలసీ తర్వాత ఢిల్లీలో విక్రయించిన మద్యంలో సగం నాటు సరుకేనని కాగ్‌ తేల్చింది. ‘‘అనేక మంది హోల్‌సేల్‌ మద్యం వ్యాపారులు బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌(బీఐఎస్‌) నిబంధనలకు అనుగుణంగా నాణ్యత పరీక్షలను నిర్వహించలేదు. ఎక్సైజ్‌ ఇంటెలిజెన్స్‌ సీజ్‌ చేసిన మద్యంలో సగం నాటు సరుకే ఉంది. అసలు ఎంత ఉత్పత్తి చేశారు? ఎంత మేర విక్రయాలు జరిగాయి? అనే దానికి లెక్కలే లేవు. మద్యం విధానం సాంతం లోపాలమయం’’ అని కాగ్‌ నివేదిక వివరించింది. సర్కారు అజమాయిషీలోని హోల్‌సేల్‌ సంస్థలకు కాకుండా.. ప్రైవేటు కంపెనీలకు పెద్ద ఎత్తున హోల్‌సేల్‌ లైసెన్సులు ఇచ్చారని, ఎక్సైజ్‌ సుంకం స్థానంలో భారీ ఎత్తున లైసెన్స్‌ ఫీజు వసూలు చేశారని ఎత్తిచూపింది. ‘‘నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి రెండు దుకాణాలను మాత్రమే కేటాయించాలి. అయితే.. 2021 పాలసీలో 54 రిటైల్‌ దుకాణాలను కేటాయించారు. ఈ విషయంలో లెఫ్టెనెంట్‌ గవర్నర్‌ నుంచి లేదా క్యాబినెట్‌ నుంచి అనుమతులు తీసుకోలేదు. అడ్డగోలుగా రాయితీలు, సడలింపులు ఇచ్చారు. దేశీయ, విదేశీ మద్యం సరఫరాకు హోల్‌సేల్‌ లైసెన్సులు లేని 14 బడా వ్యాపార సంస్థలకు కేటాయింపులు చేశారు. ఢిల్లీని 32 జోన్లుగా విభజించి, 22 సంస్థలకు రిటైల్‌ దుకాణాలను కేటాయించార’’ని కాగ్‌ స్పష్టం చేసింది.

అంతా కుమ్మక్కయ్యారు

హోల్‌సేల్‌ లైసెన్సు పొందిన వారు, జోనల్‌ లైసెన్సులు పొందిన వారు కుమ్మక్కయ్యారని కాగ్‌ తేల్చింది. హోల్‌సేల్‌ లైసెన్సులు పొందిన ఇండో స్పిరిట్‌ సంస్థకు కావోగలి రెస్టారెంట్లు అనుబంధ సంస్థలని, మహాదేవ్‌ లిక్కర్‌ అనే హోల్‌సెల్‌ సంస్థకు భగవతీ ట్రాన్స్‌ఫార్మర్‌ కార్పొరేషన్‌ అనే సంస్ఖకు సంబంధాలున్నాయని తెలిపింది. గౌతమ్‌ వైన్స్‌ అనే హోల్‌సేల్‌ సంస్థకు, ఒయాసిస్‌ బిస్లరీస్‌, విజేత బేవరేజస్‌ సంస్థల్లో వాటాలున్నాయని వివరించింది. అయితే, నాటు మద్యాన్ని విక్రయించారనే ఆరోపణలను మాజీ సీఎం ఆతిషి ఖండించారు. తాము గతంలో కంటే నాణ్యమైన మద్యాన్నే సరఫరా చేశామని వ్యాఖ్యానించారు.


మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: డీఎస్సీ‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Also Read : మాజీ ఎంపీకి జీవిత ఖైదు

Also Read: రైతుల కోసం ఈ పథకాలు.. వీటి వల్ల ఎన్నో లాభాలు.. ఇదే అర్హత.. ఇలా అప్లై చేసుకోండి చాలు

Also Read : అసోం బిజినెస్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Also Read: రిమాండ్ మళ్లీ పొడిగింపు.. విచారణలో నోరు విప్పని వంశీ

For National News And Telugu News

Updated Date - Feb 26 , 2025 | 04:43 AM