Share News

బాబోయ్‌.. విమాన ప్రయాణాలు!

ABN , Publish Date - Jun 17 , 2025 | 06:04 AM

జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన లుఫ్తాన్సా విమానం.. బాంబు బెదిరింపు కారణంగా వెనక్కి మళ్లింది.

బాబోయ్‌.. విమాన ప్రయాణాలు!

  • బాంబు బెదిరింపులు, సాంకేతిక సమస్యలు, ప్రమాదాలతో జనంలో ఆందోళన

లండన్‌/హైదరాబాద్‌, జూన్‌ 16: జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన లుఫ్తాన్సా విమానం.. బాంబు బెదిరింపు కారణంగా వెనక్కి మళ్లింది. ఫ్రాంక్‌ఫర్ట్‌ స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2.14 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.44గంటలు) బయల్దేరిన ఎల్‌హెచ్‌752 (బోయింగ్‌ 787-9 డ్రీమ్‌లైనర్‌) విమానం.. షెడ్యూలు ప్రకారం సోమవారం ఉదయానికి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోవాలి. కానీ, బయల్దేరిన రెండు గంటలకే.. బాంబు బెదిరింపు కారణంగా విమానం యూటర్న్‌ తీసుకుని తిరిగి ఫ్రాంక్‌ఫర్ట్‌కు చేరుకుంది. విమానయాన సంస్థ.. సోమవారం ఉదయం 10 గంటలకు(భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు) అదే విమానంలో వారిని హైదరాబాద్‌కు పంపింది. మరోవైపు.. ఆదివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఈ విమానానికి సంబంధించి బాంబు బెదిరింపు ఈమెయిల్‌ వచ్చినట్టు శంషాబాద్‌ విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. లండన్‌లోని హీత్రూ ఎయిర్‌పోర్టు నుంచి చెన్నైకి బయల్దేరిన బోయింగ్‌ 787-9 డ్రీమ్‌లైనర్‌ (బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ ఫ్లైట్‌ బీఏ35).. సాంకేతిక సమస్యల కారణంగా మళ్లీ లండన్‌కు చేరుకుంది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే విమానాన్ని వెనక్కి మళ్లించినట్టు బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ విమానం మళ్లీ సోమవారం మధ్యాహ్నం చెన్నైకి బయల్దేరిందని.. మంగళవారం ఉదయం చెన్నైలో ల్యాండ్‌ కానుందని తెలిపింది. ఇక.. హాంకాంగ్‌ నుంచి సోమవారం ఢిల్లీకి బయల్దేరిన ఎయరిండియా(బోయింగ్‌ 787-8) విమానంలో సాంకేతిక సమస్య ఉందని పైలట్‌ అనుమానించడంతో.. దాన్ని తిరిగి హాంకాంగ్‌కే మళ్లించి అక్కడ సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. అటు.. జెద్దా నుంచి లక్‌నవూకు 242 మంది హజ్‌ యాత్రికులతో వచ్చిన సౌదీ ఎయిర్‌లైన్స్‌ విమాన చక్రాల నుంచి పొగలు, నిప్పురవ్వలు రావడం కలకలం సృష్టించింది. అయితే ఎలాంటి ప్రమాదం జరగకుండా చూశారు.


దించి.. ఎక్కించి..

గువాహటి నుంచి కోల్‌కతా వెళ్లాల్సిన ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో సీట్లలో కూర్చొన్న ప్రయాణికులను రెండుసార్లు కిందికి దింపాల్సి వచ్చింది. 18 గంటల పాటు వేచి చూసినా సమస్య పరిష్కారం కాకపోవడంతో చివరకు మరో ప్రత్యేక విమానంలో కోల్‌కతాకు పంపాల్సి వచ్చింది. గువాహటి విమానాశ్రయం నుంచి శనివారం రాత్రి 9.20 గంటలకు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం బయలుదేరాల్సి ఉండగా సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో విమానంలోని 170 మంది ప్రయాణికులను కిందికి దించారు. సమస్య పరిష్కారమయిందని చెప్పి ప్రయాణికులను మళ్లీ కూర్చోమన్నారు. తిరిగి అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో మరోసారి అందర్నీ కిందికి దించారు. తిరిగి ఆదివారం ఉదయం 9.30 గంటల సమయంలో ప్రయాణికులంతా విమానం ఎక్కారు. సాంకేతిక సమస్య ఉందని చెప్పి ఇంకోసారి అందర్నీ కిందికి దించేశారు. చివరకు మరో విమానం ఏర్పాటు చేసి సాయంత్రం 3.34 గంటల సమయంలో ప్రయాణికులను కోల్‌కతా పంపించారు. మరోవైపు.. ఆదివారం సాయంత్రం 6.51 గంటలకు ఢిల్లీ నుంచి వడోదరకు బయల్దేరిన ఎయిరిండియా విమానాన్ని ల్యాండింగ్‌ గేర్‌లో సమస్య కారణంగా 7.20 గంటలకు తిరిగి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు.

Updated Date - Jun 17 , 2025 | 06:04 AM