Share News

Boeing Dreamliner: డ్రీమ్‌లైనర్‌ అత్యంత సురక్షితం

ABN , Publish Date - Jul 09 , 2025 | 02:40 AM

అహ్మదాబాద్‌లో అత్యంత ఘోర విషాదానికి కారణమైన బోయింగ్‌ డ్రీమ్‌లైనర్‌ విమానం పనితీరును ఎయిరిండియా సమర్థించింది.

Boeing Dreamliner: డ్రీమ్‌లైనర్‌ అత్యంత సురక్షితం

  • పీఏసీ సమావేశంలో ఎయిరిండియా

న్యూఢిల్లీ, జూలై 8: అహ్మదాబాద్‌లో అత్యంత ఘోర విషాదానికి కారణమైన బోయింగ్‌ డ్రీమ్‌లైనర్‌ విమానం పనితీరును ఎయిరిండియా సమర్థించింది. ప్రస్తుతం ఆపరేషన్‌లో ఉన్న అత్యంత సురక్షితమైన విమానాల్లో ఒకటిగా అభివర్ణించింది. ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా డ్రీమ్‌లైనర్లు పనిచేస్తున్నాయని పేర్కొంది. ఈ మేరకు పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ (పీఏసీ)కి సమర్పించిన నివేదికలో ఎయిరిండియా పేర్కొందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ‘ఎయిర్‌పోర్టుల్లో లెవీ చార్జీలు’ అంశంపై చర్చించడానికి ఏర్పాటైన ఈ సమావేశంలో జూన్‌ 12నాటి ప్రమాద ఘటన ప్రస్తావనకు రావడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. విమానాల్లో భద్రతా ప్రమాణాలపై ఆయా విమానయాన సంస్థలు సమాధానం చెప్పాలని ఎంపీలు డిమాండ్‌ చేశారు. ఇటీవల విమానాల్లో తరచుగా చోటుచేసుకుంటున్న భద్రతా లోపాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ (బీసీఏఎస్)తో తక్షణ ఆడిట్‌ జరిపించాలని కోరారు. ఈ సమావేశంలో పౌర విమానయాన శాఖ, డీజీసీఏ, ఏఏఐ, ఎయిర్‌పోర్ట్స్‌ ఎకనామిక్‌ రెగ్యులేటరీ అథారిటీ, బీసీఏఎస్‌ ఉన్నతాధికారులు, ఎయిరిండియా సీఈవో విల్సన్‌ క్యాంప్‌బెల్‌తో పాటు ఇండిగో, ఆకాశ ఎయిర్‌, ఇతర విమానయాన సంస్థల సీనియర్‌ ప్రతినిధులు హాజరయ్యారు. కాగా,ఎయిరిండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (ఏఏఐబీ) తన ప్రాథమిక నివేదికను మంగళవారం పౌర విమానయాన శాఖకు సమర్పించింది.

Updated Date - Jul 09 , 2025 | 02:40 AM