The BJP has released: బిహార్‌లో బీజేపీ రెండో జాబితా విడుదల
ABN , Publish Date - Oct 16 , 2025 | 05:37 AM
బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు 12 మందితో బీజేపీ రెండో జాబితా విడుదల చేసింది.
న్యూఢిల్లీ, పట్నా, హాజిపూర్, అక్టోబరు 15 : బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు 12 మందితో బీజేపీ రెండో జాబితా విడుదల చేసింది. ప్రముఖ గాయని మైథిలి ఠాకూర్‌కు అలీ నగర్ సీటు కేటాయించింది. అలాగే మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద్ మిశ్రాకు బక్సార్ సీటు కేటాయించింది. దీంతో మొత్తం 83 సీట్లకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించినట్లయ్యింది. కాగా బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాని నరేంద్ర మోదీ తన స్లోగన్‌ను ప్రకటించారు. ‘ఐక్య ఎన్డీయే, ఐక్య బిహార్.. తెస్తాయి బిహార్‌కు సుపరిపాలన ..’ అని బిహార్ కార్యకర్తలతో పేర్కొన్నారు. ఇంటింటికీ వెళ్లి కేంద్రం, నీతీశ్ కుమార్ ప్రభుత్వం అమలుచేస్తోన్న పథకాలను వివరించాలని వారికి సూచించారు. కాగా ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్(35) రఘోపూర్ నియోజకవర్గం నుంచి పోటీకి తల్లిదండ్రులు లాలు, రబ్రీదేవి సమక్షంలో బుధవారం హాజీపూర్‌లో నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడి నుంచి ఇప్పటికే రెండుసార్లు గెలిచిన ఆయన హ్యాట్రిక్ విజయంపై కన్ను వేశారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి గెలిచి లాలు, రబ్రీదేవి బిహార్ సీఎంలుగా పనిచేశారు. మరోవైపు బిహార్ సీఎం నీతీశ్‌కుమార్ పార్టీ జేడీయూ 57 మందితో తన తొలి జాబితాను విడుదల చేసింది. ఇదిలా ఉండగా, అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని జన్‌సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు. తాను ఎన్నికల బరిలో ఉంటే పార్టీ సంస్థాగత వ్యవహారాల నుంచి దృష్టి మరలిపోయే ప్రమాదం ఉందన్నారు.