Pahalgam attack: పహల్గాంలో పర్యాటక మహిళలు ఉగ్రవాదులపై పోరాడి ఉండాల్సింది..
ABN , Publish Date - May 26 , 2025 | 02:14 AM
పహల్గాం ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళలపై బీజేపీ ఎంపీ జంగ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. విపక్షాలు తీవ్రంగా స్పందించగా, జంగ్రా అవసరమైతే క్షమాపణ చెప్తానన్నారు.
వారు తిరగబడి ఉంటే మరణాల సంఖ్య తక్కువగా ఉండేది
బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
భివానీ, మే 25: పహల్గాం ఉగ్రదాడిలో భర్తల ప్రాణాలు కోల్పోయిన మహిళలపై బీజేపీ రాజ్యసభ ఎంపీ రామ్‌చందర్ జంగ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పర్యాటకులు ఉగ్రవాదులను వేడుకొనే బదులు.. వారిపై తిరగబడి పోరాడాల్సిందని, బాధిత మహిళల్లో యోధుల స్ఫూర్తి లేదని, అందుకే తమ భర్తలను కోల్పోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. పర్యాటకులు అగ్నివీర్ శిక్షణ పొంది ఉంటే.. ఉగ్రదాడిలో మృతుల సంఖ్య తక్కువగా ఉండేదంటూ కామెంట్ చేశారు. హరియాణాలోని భివానీలో శనివారం జరిగిన అహిల్యాబాయ్ హోల్కర్ 300వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘భర్తలను కోల్పోయిన మహిళలకు స్ఫూర్తి, శక్తి లేవు. అందుకే వారు ఉగ్రదాడి బాధితులు అయ్యారు.
వేడుకోవడం వలన ఉగ్రవాదులు ఒక్కరిని కూడా వదిలిపెట్టలేదు. మనవాళ్లు చేతులు జోడించి చనిపోయారు’ అని జంగ్రా అన్నారు. జంగ్రా వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై విపక్ష పార్టీల నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పహల్గాం దాడి బాధిత మహిళలపై జంగ్రా చేసిన అసహ్యకరమైన ప్రకటన ఖండించదగినది అనే పదం కూడా సరిపోదని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. బీజేపీ మహిళలను గౌరవించడానికి బదులు.. వారిని వేధిస్తోందని, ఇది ఆ పార్టీ నిజస్వరూపమని అన్నారు. కాగా, విమర్శలపై జంగ్రా స్పందించారు. ఎవరినీ కించపర్చాలన్నది తన ఉద్దేశం కాదని, అవసరమైతే క్షమాపణ చెప్తానని అన్నారు.
ఇవి కూడా చదవండి
Minister Satyakumar: 2047 నాటికి ప్రపంచంలో రెండో స్థానానికి భారత్ ఎదగడం ఖాయం
Transgenders: డబ్బులు అడగొద్దన్నందుకు.. నడిరోడ్డులో పోలీస్‌పై ట్రాన్స్‌జెండర్ల దారుణం..
Indian Delgation in Japan: ఉగ్రవాదం రాబిడ్ డాగ్, దాని నీచమైన నిర్వాహకుడు పాక్.. నిప్పులు చెరిగిన అభిషేక్
India slams Pak: ప్రసంగాలు ఆపండి.. UN లో పాక్‌పై విరుచుకుపడిన భారత్..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి