Nishikant Dubey: కాంగ్రెస్ వల్లే నేపాల్‌లో రాచరిక వ్యవస్థ పతనం
ABN , Publish Date - Jun 17 , 2025 | 06:15 AM
ఏకైక హిందూ దేశమైన నేపాల్‌లో రాచరిక వ్యవస్థ పతనానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు. నేపాల్ రాజు బీరేంద్రను గద్దె దించి రాచరిక వ్యవస్థను పతనం చేయడంతో పాటు అనంతర కాలంలో చైనా మద్దతున్న ప్రచండను ప్రధానిగా చేసిందన్నారు.
బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే
న్యూఢిల్లీ, జూన్ 16: ఏకైక హిందూ దేశమైన నేపాల్‌లో రాచరిక వ్యవస్థ పతనానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు. నేపాల్ రాజు బీరేంద్రను గద్దె దించి రాచరిక వ్యవస్థను పతనం చేయడంతో పాటు అనంతర కాలంలో చైనా మద్దతున్న ప్రచండను ప్రధానిగా చేసిందన్నారు. రా (రీసర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) అధికారి అమర్ భూషణ్‌కు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బాధ్యతలు అప్పగించిందని చెప్పారు. నాడు కాంగ్రెస్ అనుసరించిన తీరువల్ల నేడు భారత్ ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. ఈ మేరకు దూబే సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ‘‘1988లో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ కుటుంబ సమేతంగా నేపాల్ వెళ్లారు. పర్యటనలో భాగంగా అక్కడి పశుపతినాథ్ ఆలయాన్ని దర్శించాలనుకున్నారు.
హైందవేతరులకు ఆలయంలోకి ప్రవేశం లేదంటూ ఆలయ కమిటీ సభ్యులు సోనియా గాంధీకి అనుమతి నిరాకరించారు. దీనికి ప్రతీకారంగా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నేపాల్‌పై కక్షగట్టింది. నేపాల్‌కు వెళ్లే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ విధించడంతో పాటు ఆంక్షలు విధించింది. దీంతో నాటి నేపాల్ రాజు బీరేంద్ర.. చైనాతో ఆయుధాలు, ఆహార పదార్థాలకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నారు. తద్వారా నేపాల్ చైనా ఒడిలోకి వెళ్లినట్లైంది. అంతటితో ఆగక రా అధికారి అమర్ భూషణ్ ద్వారా నేపాల్‌లో రాచరిక వ్యవస్థ పతనమయ్యేలా చేయడంతో పాటు.. అనంతర కాలంలో ప్రచండను ప్రధానిని చేశారు’’ అని దూబే సోషల్ మీడియా పోస్టులో ఆరోపించారు.