CM Stalin: ప్రపంచ అయ్యప్ప సంగమానికి సీఎం స్టాలిన్‌కు ఆహ్వానమా?
ABN , Publish Date - Aug 26 , 2025 | 01:10 AM
మొట్టమొదటి ‘ప్రపంచ అయ్యప్ప సంగమం’ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన కేరళ సీఎం విజయన్‌పై బీజేపీ మండిపడింది.
హిట్లర్ యూదులతో కలిసి పండుగ చేసుకున్నట్లుగా ఉంది: బీజేపీ
తిరువనంతపురం, ఆగస్టు 25: మొట్టమొదటి ‘ప్రపంచ అయ్యప్ప సంగమం’ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన కేరళ సీఎం విజయన్‌పై బీజేపీ మండిపడింది. ఇది జర్మన్ నియంత హిట్లర్.. తాను అహరహం ద్వేషించే యూదులతో కలిసి పండుగ చేసుకున్నట్లుగా ఉందని ధ్వజమెత్తింది. ఈ అయ్యప్ప సంగమం వచ్చే నెల 20వ తేదీన పథనంథిట్టలో జరుగనుంది.
తన మంత్రివర్గ సహచరులు హిందూయిజంపై అవమానకర వ్యాఖ్యలు చేసినా స్పందించని స్టాలిన్‌ను దీనికి ఆహ్వానించడం హిందూమతాన్ని అవమానించడమేనని బీజేపీ కేరళ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. శబరిమలలో అయ్యప్ప భక్తులపై పోలీసు చర్యకు విజయన్ గతంలో ఆదేశాలిచ్చారని గుర్తుచేశారు. ఈ ఇద్దరు అయ్యప్ప భక్తులకు క్షమాపణ చెప్పకపోతే సంగమంలో వారిని పాల్గొననివ్వబోమన్నారు.