Delhi elections: గర్భిణులకు రూ.21వేలు
ABN , Publish Date - Jan 18 , 2025 | 04:52 AM
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రజలపై బీజేపీ వరాల వర్షం కురిపిస్తోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆకర్హణీయమైన హామీలతో బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది.

ఆరు పోషకాహార కిట్లు కూడా.. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
మహిళలకు నెలకు రూ.2,500
ఢిల్లీ ఓటర్లపై బీజేపీ హామీల వర్షం
న్యూఢిల్లీ, జనవరి 17: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రజలపై బీజేపీ వరాల వర్షం కురిపిస్తోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆకర్హణీయమైన హామీలతో బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శక్రవారం సంకల్ప్ పత్ర్ పేరిట దానిని విడుదల చేశారు. అందులో ఢిల్లీలో బీజేపీని అధికారంలోకి తీసుకువస్తే గర్భిణులకు రూ.21 వేల ఆర్థిక సాయం, ఆరు పోషకాహార కిట్లు అందిస్తామని ప్రకటించారు. వాటితో పాటు ప్రస్తుతం అందిస్తున్న మొదటి కాన్పుకు రూ.5 వేలు, రెండు కాన్పుకు రూ. 6 వేల సహాయం కొనసాగిస్తామని చెప్పారు. అలాగే మహిళా సమృద్ధి యోజన కింద మహిళలకు ప్రతినెలా రూ.2500 ఆర్థిక సాయం అందిస్తామన్నారు. రూ.500లకే ఎల్‌పీజీ సిలిండర్ అందించడంతో పాటు హోలీ, దీపావళి పండుల సందర్భంగా ఒక్కొక్క సిలిండర్ ఉచితంగా ఇస్తామని చెప్పారు. ఇక 60 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్న వృద్ధులకు నెలకు రూ.2,500, 70 ఏళ్లు పైబడిన వారికి, దివ్యాంగులకు, వితంతువులకు నెలకు రూ.3000 వేల సాయం ఇస్తామని ప్రకటించారు. అయుష్మాన్ భారత్ అమలు చేస్తామని, దీనికి అదనంగా రూ.5 లక్షల కవరేజీ ఇస్తామని ప్రకటించారు. అటల్ క్యాంటీన్‌లను ఏర్పాటు చేసి రూ.5 లకే భోజనం అందిస్తామని ప్రకటించారు.
ఉచితాలపై మోదీ ఏమంటారు: కేజ్రీవాల్
ఢిల్లీ ఎన్నికల వేళ బీజేపీ ఉచిత పథకాలు ప్రకటించడంపై ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ స్పందించారు. ఆప్‌ను కాపీ కొట్టి బీజేపీ పథకాలను ప్రకటించిందని ఆయన ఆరోపించారు. కేజ్రీవాల్ ఉచితాలు ఇస్తారని బీజేపీ నన్ను విమర్శించేది, ఇప్పుడు ఆ పార్టీనే ఢిల్లీ ప్రజలకు ఉచితాలు ప్రకటించిందని మండిపడ్డారు. ‘ఇంతకాలం ఉచితాలు మంచివి కావని మోదీ అన్నారు. కానీ వారి మేనిఫెస్టో ద్వారా ఇన్నాళ్లు వారు అన్నవి తప్పని తేలింది. ఉచితాలు హానికరం కాదని, మంచివేనని ప్రధాని ఇప్పుడు అంగీకరించాల’ని డిమాండ్ చేశారు. బీజేపీ మేనిఫెస్టోను అబద్ధాల కట్ట అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీలో విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. మెట్రోలో 50 శాతం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ నడిపే అన్ని ఏసీ, నాన్ ఏసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందిస్తుమని గుర్తు చేశారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ దాఖలుకు ఆఖరి రోజైన శుక్రవారం బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ అమలుపై సుప్రీంకోర్టు స్టే
ఆరోగ్య పథకాల అమలు విషయమై కేంద్రంతో ఒప్పందం చేసుకోవాలంటూ ఢిల్లీ ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై శుక్రవారం సుప్రీంకోర్టు స్టే విధించింది. కేంద్రం అమలు చేసే పీఎం-ఆయుష్మాన్ భారత్, ఆస్పత్రుల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు ఉద్దేశించిన పీఎం-అభీం పథకాల అమలుపై జనవరి 5లోగా కేంద్రంతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకోవాలని గత నెల 24న హైకోర్టు ఆదేశించింది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కేంద్ర పథకాలను అమలు చేస్తుండగా, ఒక్క ఢిల్లీ ప్రజలే ఆ సేవలకు ఎందుకు దూరం కావాలంటూ ఈ ఉత్తర్వులిచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కేంద్రంతో ఎంఓయూ కుదుర్చుకోవాలని ఆదేశించింది. దీనిని సవాలు చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం స్టే ఇచ్చింది.
ఏఐతో ఆప్ దూకుడు
ఢిల్లీ పీఠాన్ని వరుసగా మూడోసారి దక్కించుకోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని తన ఎన్నికల ప్రచారానికి వాడేస్తోంది. ఫిబ్రవరి 5న జరిగే ఎన్నికల కోసం అటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ, ఇటు సంప్రదాయ ప్రచారాన్ని కొనసాగిస్తూ దూసుకెళుతోంది. విపక్ష నేతలపై ఏఐ సాయంతో కామెడీ కంటెంట్‌తో వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఆ పార్టీ... మరోపక్క ర్యాలీలు, పాదయాత్రలతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకున్న స్పూఫ్ వీడియోలు ఆప్ ప్రచారంలో కీలకంగా మారాయి.