Share News

Registrar General of India: డిశ్చార్జికి ముందే బర్త్‌ సర్టిఫికెట్‌

ABN , Publish Date - Jun 29 , 2025 | 04:36 AM

ఆస్పత్రుల్లో జన్మించిన నవజాత శిశువులకు వారు డిశ్చార్జి కావడానికి ముందే తల్లులకు జనన ధ్రువీకరణ పత్రాలు అందించేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌జీఐ) రాష్ట్రాలను కోరింది.

Registrar General of India: డిశ్చార్జికి ముందే బర్త్‌ సర్టిఫికెట్‌

  • మంజూరు చేయాలని రాష్ట్రాలకు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా నిర్దేశం

న్యూఢిల్లీ, జూన్‌ 28: ఆస్పత్రుల్లో జన్మించిన నవజాత శిశువులకు వారు డిశ్చార్జి కావడానికి ముందే తల్లులకు జనన ధ్రువీకరణ పత్రాలు అందించేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌జీఐ) రాష్ట్రాలను కోరింది. ప్రధానంగా 50 శాతం పైగా జననాలు జరిగే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పేర్కొంది. జనన నమోదు పూర్తయిన తర్వాత రిజిస్ట్రార్‌ వీలైనంత త్వరగా బర్త్‌ సర్టిఫికెట్‌ను ఎలకా్ట్రనిక్‌ లేదా ఏ ఇతర ఫార్మాట్‌లోనైనా మంజూరు చేయాలని తెలిపింది. ఇందుకు ఏడు రోజుల కంటే సమయం మించరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్‌జీఐ లేఖ రాసింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులు, కమ్యూనిటీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రిజిస్ట్రేషన్‌ యూనిట్లుగా పనిచేస్తున్నాయని పేర్కొంది. బర్త్‌ సర్టిఫికెట్‌కు పెరిగిన ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని, దాన్ని తక్షణం జారీ చేయాల్సిన అవసరాన్ని ఆయా యూనిట్ల రిజిస్ట్రార్‌లు గుర్తించాలని సూచించింది. 2023, అక్టోబరు 1 నుంచి విద్యాసంస్థల్లో అడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగాలు, వివాహ నమోదు తదితర అవసరాలకు డిజిటల్‌ బర్త్‌ సర్టిఫికెట్‌ అనేది పుట్టిన తేదీకి ఒకేఒక్క ఆధారంగా ఉంది. జనన, మరణాల నమోదు చట్టం- 1969 ప్రకారం జనన ధ్రువీకరణ పత్రాన్ని జారీచేస్తూ వస్తున్నారు. అన్ని జననాలు, మరణాలను కేంద్ర ప్రభుత్వ పోర్టల్‌లో నమోదు చేయడాన్ని 2023, అక్టోబరు 1 నుంచి తప్పనిసరి చేశారు.

Updated Date - Jun 29 , 2025 | 04:38 AM